breaking news
tribel
-
ఛత్తీస్‌గఢ్‌లో మైనింగ్ వద్దంటూ ఆందోళన
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అమెరా ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ విస్తరణ అంశంలో చెలరేగిన వివాదం తీవ్ర హింసకు దారి తీసింది. మైనింగ్ విస్తరణను అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఘర్షణ చెలరేగి గిరిజనులు దాడి చేయడంతో 40మందికి పైగా పోలీసులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.సుర్గుజా జిల్లా ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ "ఇక్కడ మైన్ కోసం 2016లోనే భూసేకరణ పూర్తయింది. దానికి పరిహారం కూడా అందజేశాం. కానీ ఇప్పుడు కొంతమంది పరిహారాన్ని నిరాకరించి మైనింగ్ కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. మేము గ్రామస్థులతో మరోసారి మాట్లాడుతాం వారికి నచ్చజెప్పి మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా చేస్తాం" అని అడిషనల్ కలెక్టర్ సునీల్ నాయక్ అన్నారు. ఈ ఘర్షణలో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయని వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు.మైనింగ్ పై గ్రామస్థులు మాట్లాడుతూ.. "మాగ్రామం అంటే మాకు చాలా ఇష్టం. మా గ్రామాన్ని మేము ఏ కంపెనీలకు ఇవ్వదలచుకోలేదు. మేమెక్కడికి వెళ్లాలి? ఎంతోకాలంగా మా కుటుంబాలు ఇక్కడే పెరిగాయి, పనిచేశాయి, సంపాదించాయి. మేముకూడా ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు కంపెనీలకు భుమి ఇస్తే మా పిల్లల సంగతేంటి?" అని అక్కడి గ్రామస్తురాలు అన్నారు.అయితే ఈ ఘటనలో తొలుత పోలీసులే తమపై లాఠీ ఛార్జ్ చేశారని గ్రామస్థులు అంటుండగా గిరిజనులే తమపై రాళ్లు రువ్వారని పోలీసులు అంటున్నారు ఇరు వర్గాలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.అయితే ఈ వివాదంపై అమెరా ఓపెన్ కాస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు కోసం పర్సోడికల, అమెరా, పుహ్ పుత్ర, కట్ లోనా గ్రామాలలో ఈ భూమిని 2001 సంవత్సరంలో సేకరించి, 2011లో పనులు ప్రారంభించాము. 2019 కొంతమంది స్వార్థప్రయోజనాల కారణంగా మైన్ ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. 2024లో తిరిగి ప్రారంభించినప్పడి నుంచి దశలవారిగా భూసేకరణ చేపడుతున్నామని ఇది వరకూ రూ.10 కోట్ల పరిహారం అందిచామని తెలిపారు. పర్సోడికల వైపు మైనింగ్ విస్తరిస్తున్న సమయంలో నిరసనలు రావడంతో నవంబర్ 8నుంచి మైనింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. -
చంపా... చరిత్ర సృష్టించింది
అడుగడుగునా ఆర్థిక కష్టాలు. ‘అమ్మాయికి ఈ మాత్రం చదువు చాలు’ అనే ఇరుగు పొరుగు వెటకారాలు. అయినా సరే, చదువు విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ‘పదవ తరగతి అయినా పూర్తి చేయగలనా’ అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. దిదై అనేది ఒడిశాలోని ఒక గిరిజన తెగ. ఈ తెగ నుంచి జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణత సాధించిన తొలి విద్యార్థిగా చంపా రాస్పెడా చరిత్ర సృష్టించింది.ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని అమ్లిబెడ గ్రామానికి చెందిన చంపా రాస్పెడా తల్లి గృహిణి. తండ్రి ఓ పేద రైతు. ఆర్థిక కష్టాల వల్ల ఒకానొక దశలో చంపాకు చదువు కొనసాగించడం కష్టమైంది. అయినా సరే, ఎలాగో ఒకలా ఆర్థిక కష్టాలను అధిగమించి ముందడుగు వేసింది.చిత్రకొండలో హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత గోవింద్పల్లిలోని ఎస్ఎస్డీ హైయర్ సెకండరీ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తరువాత ఆర్థిక కష్టాలతో బీఎస్సీ చదువు మధ్యలోనే ఆగిపోయింది. అయితే హైస్కూల్ రోజుల్లో చంపాకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్ ధైర్యం చెప్పడమే కాదు బాలసోర్‌లోని నీట్ ఉచిత శిక్షణ తరగతులలో చేర్పించారు.ఆ క్లాస్‌లలో చేరిన క్షణం నుంచే ‘ఎలాగైనా డాక్టర్ కావాల్సిందే’ అనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుంది. తన కలను నిజం చేసుకుంది చంపా. బాలసోర్‌లోని ఫకీర్ మోహన్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ పొందింది.మల్కన్‌గిరి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే దిదై తెగ ప్రజలకు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు ప్రధాన జీవనాధారం. చదువు వారికి చాలా దూరంగా ఉండేది. ఇప్పుడిప్పుడే వారు చదువుకు దగ్గరవుతున్నారు. ఈ దశలో చంపా సాధించిన విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.‘వైద్యురాలిగా పేదప్రజలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆర్థిక కష్టాలు అడ్డంకి కాదు... అనే విషయాన్ని విద్యార్థులలో విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నాను’ అంటుంది చంపా రాస్పెడా.‘ఈ విజయానికి మూలం ఆమె పడిన కష్టం. అంకితభావం. ఆమె విజయం ఒడిశాలోని యువతకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. వైద్యురాలిగా పేదప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నాను. ఆమె భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చంపా రాస్పెడా గురించి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి.ఈ ఇంట్లోనే...‘రకరకాల మూఢనమ్మకాల వల్ల మా కమ్యూనిటీలో ఆడపిల్లల చదువుకు పెద్దగాప్రాధాన్యత ఇవ్వరు’ అంటున్న చంపా రాస్పెడా తన తల్లిదండ్రులను ఒప్పించి, ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ చదువు దారిలో ముందుకు వెళ్లింది. పెద్దగా సౌకర్యాలు లేని ఇంట్లో పెరిగింది చంప. ఇప్పుడు సాధారణ దృశ్యంగా కనిపిస్తున్న ఆమె ఇంటి చిత్రం భవిష్యత్‌లో స్ఫూర్తిదాయక చిత్రంగా నిలవనుంది. ‘ఈ ఇంట్లోనే చదివి చంప డాక్టర్ అయింది’ అనే ఒక్కమాట చాలదా ఎంతోమంది అమ్మాయిలలో ధైర్యం నింపడానికి, ‘మేము కూడా సాధించాలి’ అని వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి! -
ఇవోరకం పూతరేకులు..!
వీటిని దూరం నుంచి చూస్తే, బొగ్గుముక్కల్లా కనిపిస్తాయి. దగ్గరగా చూస్తే, మాడిపోయిన పూతరేకుల్లా కనిపిస్తాయి. నిజానికి ఇవి పూతరేకుల్లాంటి వంటకమే! కాకుంటే, మాడిపోలేదు, ఎవరూ కావాలని వీటిని మాడ్చేయలేదు. వీటి తయారీకి వాడే ముడిపదార్థాల కారణంగానే నల్లగా కనిపిస్తాయి. ‘పికి బ్రెడ్’ అని పిలుచుకునే ఈ సంప్రదాయ వంటకం తయారీలో నల్లని మొక్కజొన్న గింజల నూక, నల్లగా నిగనిగలాడే జూనిపర్ బెర్రీలను కాల్చి తయారు చేసిన బూడిదను ప్రధానంగా వాడతారు. తయారీ ప్రక్రియ దాదాపు మన పూతరేకుల మాదిరిగానే ఉంటుంది. పూతరేకుల తయారీలో కుండ అడుగున మంటపెట్టి, పిండిని కుండ మీద ఒక్కోపూతగా పూసి, వాటిని ఒద్దికగా చుడతారు. ‘పికో బ్రెడ్’ తయారీకి రాతిపలక కింద మంట పెడతారు. వేడెక్కిన రాతి పలక మీద ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని అతి సన్నని పొరలుగా కాలుస్తారు. కొన్ని పొరల దొంతరలను ఇలా పూతరేకుల్లా చుడతారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో నివసించే ‘హోపీ’ తెగవారి సంప్రదాయ వంటకం ఇది. ఈ తీపి వంటకాన్ని పండుగలు, పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాలలో తయారు చేసుకుంటారు.(చదవండి: కొరకరాని గింజలే గాని...) -
Hana-Rawhiti: అట్లుంటది ఆమెతోని..!
‘కాంతారా’ లోని గుండె గుభిల్లుమనే ‘అరుపు’ ఆ సినిమాను చూసిన వారి చెవుల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుపే గురువారం నాడు న్యూజిల్యాండ్ పార్లమెంట్ హాల్లో ప్రతిధ్వనించింది! ఆ దేశ చరిత్రలోనే అతి చిన్న వయసు ఎంపీ అయిన 22 ఏళ్ల హానా రాహిటీ మైపీ–క్లార్క్ కంఠనాళాలను చీల్చుకుంటూ ఒక్కసారిగా బయటికి వచ్చిన అరుపు అది. 123 మంది సభ్యులు గల ఆ నిండు సభను ఒక ఊపు ఊపిన ఆ అరుపు.. మావోరీ ఆదివాసీ తెగల సంప్రదాయ రణన్నినాదమైన ‘హాకా’ అనే నృత్య రూపకం లోనిది! న్యూజీలాండ్ ప్రభుత్వం తీసుకు రాబోతున్న కొత్త బిల్లుకు నిరసనగా, ఆ బిల్లు కాగితాలను రెండుగా చింపి పడేసి, తన సీటును వదిలి రుద్ర తాండవం చేసుకుంటూ పార్లమెంట్ హాల్ మధ్యలోకి వచ్చారు హానా! ఆమెతో జత కలిసేందుకు తమ సీట్లలోంచి పైకి లేచిన మరికొందరు ఎంపీలు ‘హాకా’ డ్యాన్స్ కు స్టెప్పులు వేయటంతో నివ్వెరపోయిన స్పీకర్ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేయవలసి వచ్చింది. హానా ‘మావోరీ’ పార్టీకి చెందిన ప్రతిపక్ష ఎంపీ. మావోరీ తెగల హక్కుల పరిరక్షకురాలు. బ్రిటిష్ ప్రభుత్వానికీ, మావోరీలకు మధ్య కుదిరిన 1840 నాటి ‘వైతాంగి ఒప్పందం’ ద్వారా మావోరీలకు సంక్రమిస్తూ వస్తున్న ప్రత్యేక హక్కులను మొత్తం న్యూజీలాండ్ ప్రజలందరికీ వర్తింపజేసేలా మార్పులు చేసిన తాజాబిల్లును మావోరీల తరఫున హానా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతకు సంకేతంగానే పార్లమెంటులో అరుపు అరిచారు. అధికార పక్షాన్ని ఓ చరుపు చరిచి బిల్లు కాగితాలను చింపేశారు.ఈ ఏడాది జనవరిలో కూడా హానా ఇదే అరుపుతో పార్లమెంటు దద్దరిల్లిపోయేలా చేశారు. అంతకు ముందే డిసెంబరులో కొత్తగా ఏర్పాటైన న్యూజిలాండ్ ప్రభుత్వం తొలి పార్లమెంటు సమావేశం లో... మాతృభాషను నేర్చుకోవాలని తహతహలాడుతున్న మావోరీ పిల్లలకు మద్దతుగా ఆమె దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ‘హాకా’ వార్ క్రై నినాదాన్ని ఇచ్చారు. ‘‘నేను మీ కోసం చనిపోతాను. అయితే నేను మీకోసం జీవిస్తాను కూడా..’’ అని పార్లమెంటు సాక్షిగా ఆమె మావోరీ తెగలకు మాట ఇచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీపదేశం అయిన న్యూజీలాండ్‌లో 67.8 శాతం జనాభా ఉన్న యూరోపియన్ ల తర్వాత 17.8 శాతం జనాభాతో మావోరీలే ద్వితీయ స్థానంలో ఉన్నారు. తక్కిన వారు ఆసియా దేశస్తులు, పసిఫిక్ ప్రజలు, ఆఫ్రికన్ లు, ఇతరులు. తాజామార్పుల బిల్లులో అందరినీ ఒకేగాట కట్టేయటాన్ని మావోరీలకు మాత్రమే ప్రత్యేకమైన పెద్దగొంతుకతో హానా ప్రశ్నిస్తున్నారు. -
అప్పుల బాధతో గిరిజన రైతు ఆత్మహత్య
జఫర్‌గఢ్ : అప్పుల బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తీగారం గ్రామ శివారు లింబనాయక్‌తండాలో బుధవారం జరిగింది. బాధి త కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మాలోతు మోతీలాల్(45) వ్యవసాయం చేసుకుంటూ తన భార్య, పిల్లలను పోషించుకుంటున్నాడు. మోతీ లాల్‌కు ముగ్గురు కుమార్తెలు ఉండగా ఇందులో ఇద్దరి వివాహం చేశాడు. పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులతోపాటు కరువు తీవ్రత వల్ల గత రెండేళ్లుగా పంట దిగుబడి రాక మరిం త అప్పుల పాలయ్యాడు. రోజూలాగే తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన మోతీలాల్ అక్కడే మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఇంటికి వచ్చా డు. పురుగుల మందు తాగిన విషయాన్ని తన భార్యకు చెప్పి ఇంటి వద్ద స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.


