ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అమెరా ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ విస్తరణ అంశంలో చెలరేగిన వివాదం తీవ్ర హింసకు దారి తీసింది. మైనింగ్ విస్తరణను అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఘర్షణ చెలరేగి గిరిజనులు దాడి చేయడంతో 40మందికి పైగా పోలీసులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.
సుర్గుజా జిల్లా ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ "ఇక్కడ మైన్ కోసం 2016లోనే భూసేకరణ పూర్తయింది. దానికి పరిహారం కూడా అందజేశాం. కానీ ఇప్పుడు కొంతమంది పరిహారాన్ని నిరాకరించి మైనింగ్ కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. మేము గ్రామస్థులతో మరోసారి మాట్లాడుతాం వారికి నచ్చజెప్పి మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా చేస్తాం" అని అడిషనల్ కలెక్టర్ సునీల్ నాయక్ అన్నారు. ఈ ఘర్షణలో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయని వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
మైనింగ్ పై గ్రామస్థులు మాట్లాడుతూ.. "మాగ్రామం అంటే మాకు చాలా ఇష్టం. మా గ్రామాన్ని మేము ఏ కంపెనీలకు ఇవ్వదలచుకోలేదు. మేమెక్కడికి వెళ్లాలి? ఎంతోకాలంగా మా కుటుంబాలు ఇక్కడే పెరిగాయి, పనిచేశాయి, సంపాదించాయి. మేముకూడా ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు కంపెనీలకు భుమి ఇస్తే మా పిల్లల సంగతేంటి?" అని అక్కడి గ్రామస్తురాలు అన్నారు.
అయితే ఈ ఘటనలో తొలుత పోలీసులే తమపై లాఠీ ఛార్జ్ చేశారని గ్రామస్థులు అంటుండగా గిరిజనులే తమపై రాళ్లు రువ్వారని పోలీసులు అంటున్నారు ఇరు వర్గాలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
అయితే ఈ వివాదంపై అమెరా ఓపెన్ కాస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు కోసం పర్సోడికల, అమెరా, పుహ్ పుత్ర, కట్ లోనా గ్రామాలలో ఈ భూమిని 2001 సంవత్సరంలో సేకరించి, 2011లో పనులు ప్రారంభించాము. 2019 కొంతమంది స్వార్థప్రయోజనాల కారణంగా మైన్ ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. 2024లో తిరిగి ప్రారంభించినప్పడి నుంచి దశలవారిగా భూసేకరణ చేపడుతున్నామని ఇది వరకూ రూ.10 కోట్ల పరిహారం అందిచామని తెలిపారు. పర్సోడికల వైపు మైనింగ్ విస్తరిస్తున్న సమయంలో నిరసనలు రావడంతో నవంబర్ 8నుంచి మైనింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది.


