సాక్షి శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు సరుబుజ్జులి మండలం వెన్నెల వలసలో గిరిజనుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను గిరిజనులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దంటూ నినాదాలు చేశారు. కూన రవికుమార్ ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
అయితే కొద్ది రోజుల క్రితం థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా వెన్నెలవలస నుంచి సరుబుజ్జిలి వరకూ ర్యాలీ నిర్వహించాలని తలపించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే గిరిజనులు నిరసనలు చేపట్టారు. సురుబుజ్జి, బూర్జ మండలాలలో పవర్ ప్లాంట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని పవర్ ప్లాంట్ నిర్మాణంతో పర్యావరణానికి తీవ్ర స్థాయిలో ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.
థర్మల్ ప్లాంట్ నిర్మాణం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని గిరిజనులు భావిస్తున్నారు. స్థానికుల జీవనోపాధి అయిన అడవులు, నీటి వనరులు, వ్యవసాయం ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న గిరిజనులు.. ఈ మేరకు నిరసనల చేపట్టారు. ఇది గత కొంతకాలం నుంచి కూటమి ప్రభుత్వానికి ఎదురవుతున్న నిరసన సెగ. ఇప్పటికే -థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ శ్రీకాకుళంలో ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. స్థానికులు తమ భూములు, వనరులు కాపాడుకోవడానికి సంఘటిత పోరాటం చేస్తున్నారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఎదురైన నిరసన సెగ.. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఈ సంఘటనతో థర్మల్ ప్లాంట్ ప్రతిపాదనపై రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తం అయ్యే అవకాశం ఉంది. గిరిజనుల నిరసనను విస్మరిస్తే మాత్రం వారి నిరసనలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన సమస్య కాబట్టి, వారి నిరసనకు ప్రజాబలం పెరుగుతుంది. మొత్తంగా, శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం గిరిజనుల ఆందోళనలకు కేంద్రబిందువుగా మారింది.



