నెల్లూరు సిటీ: నా భర్త ఏ మార్పును తీసుకుని రావాలని అనుకున్నారో.. అదే దారిలో తానూ నడుస్తానంటూ గంజాయి కిరాతకుల చేతిలో బలైపోయిన పెంచలయ్య భార్య దుర్గా అలియాస్ రమ్య స్పష్టం చేసింది. నగరంలోని ఆర్‌టీడీ కాలనీలోని ఆమె నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఐటీఐ చదివారని, పిల్లలను మంచి చదువులు చదివించాలని అనుకున్నాడు. ఆర్‌టీడీ కాలనీలో తమ పాటికి తాము ఉన్నామని, ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయన్నారు.
బోడిగాడితోటలో ఉన్పప్పుడు అక్కడి వాళ్లమని చెప్పుకోలేకపోయామని, ఇప్పుడు ఆర్‌టీడీ కాలనీకి చెందిన వాళ్లమని కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానికంగా గంజాయి విక్రయాలపై తన భర్త వారికి వ్యక్తిగతంగా చెప్పారు. కానీ ఆగలేదన్నారు. సీఐ, ఎస్సైల సహకారంతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారన్నారు. దీంతో వాళ్ల వ్యాపారం పడిపోయిందని భయం పుట్టిందన్నారు. స్థానికంగా ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి చెందిన డబ్బులు, నగలు కూడా అరవ కామాక్షి తినేశారన్నారు. ఎవరితోనూ తన భర్తకు విభేదాలు లేవన్నారు. కాలనీలో మార్పు తీసుకుని రావాలని ప్రయత్నించి నా భర్త వారిలో చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైనా, వీరమరణం పొందారని భావిస్తున్నట్లు తెలిపారు.


