మంత్రి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్ అనైతిక వ్యవహారాలపై ఒంటరి మహిళ ఆవేదనను వెలుగులోకి తేవడమే నేరం
కొందరు టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
విజయనగరం ‘సాక్షి’ కార్యాలయంలో అందజేసిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాక్షి మీడియాపై టీడీపీ నాయకులు కక్షగట్టారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్ అనైతిక వ్యవహారాలపై ఓ ఒంటరి మహిళ (దివంగత ఉపాధ్యాయుడి భార్య) ఆవేదనను, ఫిర్యాదులను ప్రజల ముందు ఉంచినందుకు కొందరు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వితంతు మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆరి్థకంగా దోచుకోవడమే కాకుండా లైంగికంగా వేధించిన సతీష్ వ్యవహారాన్ని ‘సాక్షి’తో పాటు పలు మీడియా చానళ్లు ప్రజల ముందుకు తెచ్చాయి.
ఈ తరుణంలో బాధితురాలికి అండగా నిలుస్తూ తన పీఏపై చర్యలు తీసుకోవాల్సిన మంత్రి సంధ్యారాణి కేవలం ‘సాక్షి’ మీడియాను టార్గెట్ చేశారు. తమపై వార్తలు ప్రచురించి, చానల్‌లో ప్రసారం చేయడాన్ని భరించలేక ఏకంగా ‘సాక్షి’ మీడియాపైకి పోలీసులను ఉసిగొల్పారు. సాలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం నుంచి విజయనగరం ‘సాక్షి’ కార్యాలయానికి సోమవారం వచ్చిన పోలీసులు నోటీసులు అందజేశారు. పీఏ సతీష్‌కు వ్యతిరేకంగా కథనాలు ఇచి్చనందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
మక్కువ మండల టీడీపీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్‌నాయుడు లెటర్ హెడ్‌పై టీడీపీ సాలూరు పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ తదితరుల ఫిర్యాదు మేరకు 353(1)(బి), 353(1)(సి), 356(1), 356(2) బీఎన్‌ఎస్ 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.


