కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వరకట్న వేధింపుల దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లోని జుహి ప్రాంతానికి చెందిన లుబ్నా, మొహమ్మద్ ఇమ్రాన్‌లకు నవంబర్ 29న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. కోటి కలలతో లుబ్నా మరుసటి రోజు తన అత్తమామల ఇంటిలో అడుగుపెట్టింది. అయితే ఆమె కలలు 24 గంటలు ముగియకుండానే కల్లలయ్యాయి. అదనపు కట్నం కోసం ఆమెను వేధించి, భర్త ఇమ్రాత్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు లుబ్నాను బయటకు గెంటేశారు.
లుబ్నా తన అత్తమామల ఇంటికి వచ్చిన వెంటనే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ లేదా దానికి బదులుగా రెండు లక్షల నగదు ఇవ్వాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసింది. ‘నేను ఇంటికి వచ్చిన వెంటనే గొడవ మొదలైంది. మాకు బుల్లెట్ బైక్ ఇవ్వలేదు.. వెంటనే ఇంటికి వెళ్లి రూ. రెండు లక్షలు తీసుకురా అంటూ వారు తనను కొట్టడం ప్రారంభించారు’ అని లుబ్నా పోలీసులకు వివరించింది. అత్తామామలు తనను కొట్టడమే కాకుండా, తమ పుట్టింటివారు పెట్టిన నగలు, నగదును కూడా వారు బలవంతంగా తీసేసుకున్నారని బాధితురాలు ఆరోపించింది.
లుబ్నా తల్లి మెహతాబ్ మాట్లాడుతూ తమ కుమార్తె వివాహానికి లక్షలు ఖర్చు చేశామని, తమ శక్తి మేరకు సోఫా సెట్, టీవీ, వాషింగ్ మెషిన్, కిచెన్ సామాగ్రి తదితర విలువైన బహుమతులు ఇచ్చామని తెలిపారు. పెళ్లికి ముందు బైక్ డిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావన తేలేదని, ఒకవేళ ముందే అడిగి ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకోమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తమ కుమార్తె కన్నీటితో ఇంటికి వచ్చి జరిగిన దారుణాన్ని వివరించిందని మెహతాబ్ తెలిపారు.
ఈ ఘటనపై లుబ్నా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మొహమ్మద్ ఇమ్రాన్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని, పెళ్లికి ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని లుబ్నా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వరకట్న దాహంతో పెళ్లైన మరుసటి రోజే కొత్త కోడలిని వేధింపులకు గురిచేసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: చూపు లేకున్నా.. శరీరం సహకరించకున్నా..


