రాయ్‌పూర్: మావోయిస్టు పార్టీ అగ్రనేత, పీఎల్‌జీఏ నెంబర్ -1 కమాండర్ బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవన్న లొంగుబాటుపై బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాడ్సే దేవా లొంగుబాటు కేవలం ప్రచారం, ఊహాగానం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.
బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ తాజాగా మాట్లాడుతూ..‘బస్తర్‌లో పునరావాసం విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆశన్నతో పలువురు మావోయిస్టులు పునరావాస విధానం ద్వారా జన జీవన స్రవంతిలోకి వచ్చారు. 570 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ, బార్సే దేవా, పాపారావులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుతున్నాం. వారు లొంగిపోవడానికి ఇదొక అనుకూలమైన సమయం’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. ఆపరేషన్ కగార్‌లో.. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్‌వాంటెడ్ మడివి హిడ్మా కిందటి నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యతలను దేవన్న స్వీకరించారనే ప్రచారం ఒకటి ఉంది. అయితే దండకారణ్యంలో తీవ్ర నిర్బంధాన్ని ఆయన దళం భరించలేకపోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు లొంగిపోవడం.. ఎన్‌కౌంటర్‌లలో మరణించడం.. జనవరి 1వ తేదీన భారీ సంఖ్యలో లొంగుబాటులు ఉంటాయని మావోయిస్టు నాయకత్వం నుంచి ప్రకటన వెలువడడం.. తదితర పరిస్థితుల నడుమ దేవన్న సైతం లొంగిపోవాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, దేవన్నపై కోటి రూపాయల రివార్డు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. దేవన్నను లొంగిపోవాలని ఆయన తల్లి కూడా కోరుతోంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
బార్సే దేవా స్వస్థలం సుక్మా జిల్లా( ఛత్తీస్‌గఢ్) పూవర్తి గ్రామం. హిడ్మా దేవన్నలది ఒకే ఊరు.. పక్కపక్కనే నివాసాలు కూడా!. హిడ్మా, దేవన్నకు చిన్నతనం నుంచే మంచి అనుబంధం ఉంది. హిడ్మా వెంటే పోరాటబాటలో నడిచాడు దేవన్న. 2017లో హిడ్మాకు పార్టీలో కీలక పదవి దక్కడంతో పీఎల్‌జీఏ నెంబర్ -1 కమాండర్ బాధ్యతలను దేవన్న స్వీకరించాడు. దండకారణ్యాలలో మెరుపు దాడులకు ఈ విభాగం స్పెషల్. అప్పటి నుంచి ఈ గ్రూప్‌తో పలు దాడులకు నాయకత్వం వహించాడు దేవన్న. ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత ప్రైజ్‌మనీ ఉందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


