మాజీ మావోయిస్టు సిద్ధన్న దారుణ హత్య | former maoist ballepu narsaiah incident | Sakshi
Sakshi News home page

మాజీ మావోయిస్టు సిద్ధన్న దారుణ హత్య

Nov 28 2025 7:53 AM | Updated on Nov 28 2025 7:55 AM

former maoist ballepu narsaiah incident

సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో ఘటన

వేములవాడకు బయలుదేరిన కుటుంబ సభ్యులు

సంచలనం సృష్టించిన మర్డర్‌ 

వేములవాడ అర్బన్‌:  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన మావోయిస్టు మాజీ డిప్యూటీ దళ కమాండర్‌ బల్లెపు నర్సయ్య అలియాస్‌ సిద్ధన్న అలియాస్‌ బాపురెడ్డి(58) గురువారం సాయంత్రం హత్యకు గురయ్యారు. వేములవాడ శివారులోని అగ్రహారం గుట్టల్లో సిద్దన్నను జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్‌ అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పీపుల్స్‌వార్‌ సిద్ధన్నగా పేరుగాంచిన నర్సయ్య దశాబ్దకాలం పాటు ఉద్యమంలో పనిచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుపరిచితులైన సిద్ధన్న హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది.

 1997 ప్రాంతంలో పీపుల్స్‌వార్‌ పార్టీ(ఇప్పటి మావోయిస్టు)లో పనిచేశారు.  ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌లో సిద్ధన్న ఇంటర్వ్యూ ఇస్తూ.. జగిత్యాల జిల్లాకు చెందిన ఫలానా వ్యక్తిని పార్టీ నిర్ణయం మేరకు హత్య చేసినట్లు చెప్పారు. యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వూ్యను చూసిన సదరు హత్యకు గురైన వ్యక్తి కొడుకు సంతోష్‌ సిద్ధయ్యపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని భావించినట్లు సమాచారం. ఇటీవల సిద్ధన్నతో స్నేహం చేసినట్లు తెలిసింది. మీరు యూట్యూబ్‌ ఇంటర్వూ్యలు చాలా బాగా ఇస్తున్నారు.. మీరంటే నాకు ఎంతో అభిమానమంటూ నమ్మబలికాడు. ఈక్రమంలోనే సిరిసిల్లకు వస్తూ సిద్ధన్నను కలుస్తూ పోతున్నట్లు సమాచారం. 

గురువారం వేములవాడ శివారులోని అగ్రహారం గుట్టల్లోకి తీసుకెళ్లి సిద్ధన్నపై బండరాళ్లు ఎత్తేసి హత్య చేసినట్లు తెలిసింది. సంతోష్‌ పోలీసులకు లొంగిపోయి ఈ సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు సిద్ధన్నకు ఇద్దరు భార్యలు పోచవ్వ, ఎల్లవ్వ, ముగ్గురు పిల్లలు అశోక్, నరేశ్, పద్మ ఉన్నారు. సిద్ధన్న హత్యకు గురైనట్లు తెలిసిన కుటుంబ సభ్యులు గండిలచ్చపేట నుంచి బయలుదేరి వేములవాడకు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్, ఎస్సై రామ్మోహన్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోవర్టు హత్యాకాండలో భాగస్వామి
అప్పటి పీపుల్స్‌వార్‌ జిల్లా కార్యదర్శి ఆజాద్‌ అలియాస్‌ గాజర్ల సారయ్య ఆదేశాలతో 2003లో తొమ్మిది మంది దళసభ్యులను పీపుల్స్‌వార్‌ పార్టీ కోవర్టుకు పాల్పడ్డారని హత్య చేశారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల–మరిమడ్ల శివారుల్లో ఆరుగురిని, మానాల శివారులో ముగ్గురిని పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు హతమార్చారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న సిద్ధన్న ఈ సంఘటన కలిసి వేసిందని, తొమ్మిది మంది సహచరులను ఏకకాలంలో చంపడం బాధ అనిపించిందని సిద్ధన్న ఇంటర్వూ్యలో చెప్పారు. అంతకుముందు వీర్నపల్లి మండలం మద్దిమల్ల ఎన్‌కౌంటర్‌లోనూ సిద్ధన్న తప్పించుకున్నారు. 2004లో పోలీసులకు లొంగిపోయారు. సొంతూరు గండిలచ్చపేటలో నివాసం ఉంటున్నారు. దశాబ్ద కాలం పాటు పీపుల్స్‌వార్‌లో పనిచేసిన సిద్ధన్న చివరికి ఇలా హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. సంతోష్‌ ఒక్కరే ఈ దారుణానికి ఒడిగట్టారా.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement