‘మా బతుకులు ఆగమైనయ్..’
● 60 గుంటలకు 15 గుంటలే మిగిలినయి ● ఆదుకోవాలని రైతు కుటుంబం వేడుకోలు
సిరిసిల్లక్రైం: అందరి అభివృద్ధి కోసం తమ బతుకులు ఆగమైనయని.. 60 గుంటల భూమికి 15 గుంటలే మిగిలిందని.. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధిత రైతు కుటుంబ సభ్యురాలు పోలీసుల కాళ్లపై పడి వేడుకోవడం కలచివేసింది. ఈ సంఘటన రగుడు బైపాస్‌రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రగుడుకు చెందిన పొచవేని బాలయ్య–భారతవ్వ దంపతులకు కలెక్టరేట్ సమీపంలో 60 గుంటల వ్యవసాయ భూమి ఉండేది. అభివృద్ధి పనుల్లో భాగంగా వీరి భూమి పోయింది. ప్రస్తుతం 15 గుంటలే మిగిలింది. గతంలోనే వీరి భూమిలో ఉన్న వ్యవసాయబావి కూల్చి వేతకు అధికారులు నోటీస్‌లు ఇచ్చారు. గురువారం నాడు ఆ బావిని కూల్చేందుకు అధికారులు పొలం వద్దకు చేరుకోగా.. తమ ఉపాధి పోతుందని కూల్చొద్దంటూ రైతు కుటుంబ సభ్యులు అధికారులను వేడుకున్నారు. అయినా వారిని పోలీస్‌స్టేష న్‌కు తరలించి, వారితో తాము పనులకు అడ్డురాబోమని పేపర్‌పై రాయించుకున్నట్లు తెలిసింది. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు గత ప్రభుత్వంలోనూ పరిహారం పరంగా న్యాయం జరగలేదని, ఇప్పటి ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


