వద్దంటే వినరూ..
● కొయ్యకాలు కాల్చుతున్న రైతులు ● దెబ్బతింటున్న భూసారం ● పర్యావరణానికి ముప్పు
సిరిసిల్ల: ఓ వైపు వరికోతలు, వడ్ల కొనుగోళ్లు కొనసాగుతుండగా.. మరోవైపు యాసంగికి పొలాలు దున్నుతూ... వరినార్లు పోస్తున్నారు. ఇప్పటికే కోసిన వరిపొలాల్లోని కొయ్యకాళ్లను రైతులు కాలబెట్టుతున్నారు. ఇలా కొయ్యకాలును.. పంట అవశేషాలను కాల్చితే సారవంతమైన భూముల్లో పోషకాలు నశిస్తాయని, పర్యావరణానికి ముప్పు వాటిస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చెప్పినా రైతులు వినిపించుకోవడం లేదు. వద్దంటే వినకుండా.. ఏటా అదే పనిని చేస్తున్నారు.
నేలలో సూక్ష్మజీవులు నశిస్తాయి
భూమిలో అనేక సూక్ష్మజీవులు పంటకు మేలుచేస్తాయి. వానపాములు(ఎర్రలు) లాంటి జీవులు అగ్నికి ఆహుతి అయిపోతాయి. భూసారాన్ని పెంచే వానపాములు క్షీణిస్తే.. సహజంగా పంటలకు సేంద్రియ ఎరువును అందించే జీవులు లేకుండా పోతాయి. ఫలితంగా పంటకు సహజసిద్ధమైన సేంద్రియ ఎరువు కరువు అవుతుంది. భూసారం యథాస్థితికి చేరాలంటే.. చాలా సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కలియదున్నితేనే మేలు
నిజానికి కొయ్యకాలును తడిపి పొలంలోనే కలియదున్నితే కుళ్లిపోయి సేంద్రియ ఎరువు తయారవుతుంది. కాల్చడం మూలంగా భవిష్యత్‌లో పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. భూసారంలో లోపాలు తలెత్తి భూములు నిస్సారంగా మారుతాయి. ఎరువులు వాడుతూ.. పంటల దిగుబడి సాధిస్తున్నా.. ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు పంటను కాల్చకుండా కలియదున్నాలని, సేంద్రియ ఎరువులతో భూమికి, పంటకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
రైతులకు ఎంత చెబుతున్నా వినడం లేదు. పొలంలోని కొయ్యకాలును కాలబెడుతూనే ఉన్నారు. ఇది తప్పుడు పద్ధతి అని చెప్పినా వినిపించుకోవడం లేదు. పొలంలో కొయ్యకాలును కలియదున్నితే పంట అవశేషాలు కుళ్లిపోయి భూమికి కావాల్సిన పోషకాలు అందుతాయి. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చు. బహుముఖ ప్రయోజనాలను గుర్తించి కొయ్యకాలు, పంట అవశేషాలను కాల్చవద్దు.
– అఫ్జల్‌బేగం, జిల్లా వ్యవసాయ అధికారి
వద్దంటే వినరూ..


