రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గళమెత్తాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేయాలి
సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అందరం ప్రధానిని కలుద్దాం
పార్లమెంట్ సభ్యుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమస్యలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ‘బీసీలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చే విధంగా కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. అందుకోసం నిర్దేశిత ఫార్మాట్‌లలో వాయిదా తీర్మానాలు, ప్రశ్నోత్తరాల ద్వారా పార్లమెంట్ దృష్టికి తీసుకుని రావాలి.
ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక వినతిపత్రాన్ని ఇవ్వాలి..’అని విజ్ఞప్తి చేశారు. ప్రజాభవన్‌లో గురువారం రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రం నుంచి సహకారం అందాల్సిన 12 శాఖలకు సంబంధించి 47 అంశాలపై డిప్యూటీ సీఎం ఎంపీలకు వివరించారు.
పార్లమెంటులో గళమెత్తాలి
‘రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పార్లమెంటులో గళం ఎత్తాలి. ప్రధాని సమయం ఇస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని వివరించాలి. అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ బిల్లును పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని, అక్కడి నుంచి గవర్నర్‌కు, ఆ తర్వాత కేంద్రానికి బిల్లు వెళ్లాక పెండింగ్‌లో ఉన్న విషయాన్ని వివరించాలి. ఎంపీలకు ఎలాంటి సమాచారం కావాలన్నా నిమిషాల్లో అందించడానికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది..’అని భట్టి తెలిపారు.
నిధులపై ఫాలోఅప్ చేయాలి
‘కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, పథకాలకు సంబంధించి గతంలో లేఖలు రాశాం. ఆ లేఖలు ఢిల్లీలోని ప్రత్యేక విభాగంలో ఎంపీలకు అందుబాటులో ఉంటాయి. వాటి ఆధారంగా ఎంపీలు ఫాలోఅప్ చేయవచ్చు. డిసెంబర్ 9 నాటికి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ‘2047 విజన్ డాక్యుమెంట్’ఆవిష్కరించనున్నాం. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులను, దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం.
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను, ఎంపీలందరినీ ఆహ్వానించాలని భావిస్తున్నాం. ఆసక్తి ఉన్న ఎంపీలు పేర్లు ఇస్తే ప్రభుత్వం వేయబోయే కమిటీల్లో సభ్యులుగా నమోదు చేస్తాం. దేశంలో, ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు, సంస్థలతో ఎంపీలకు పరిచయం ఉంటే వారి వివరాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారిని కూడా గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తాం..’అని భట్టి తెలిపారు. సీఎస్ కె.రామకృష్ణారావు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు పలు అంశాలను ప్రస్తావించారు.
700 ఎకరాలు అదనమా?
‘ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం కోసం 700 ఎకరాలు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. ఇప్పటికే అక్కడ 369 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వం పేర్కొన్న 700 ఎకరాల్లో ఈ 369 ఎకరాలు అంతర్భాగమేనా..? లేక 700 ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారా..?’అని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ ప్రశ్నించారు.
దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వెయ్యి ఎకరాలు అవసరమని ఏఏఐ లేఖ రాసిందని, అందువల్ల ఇప్పటికే ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 700 ఎకరాల భూ సేకరణ చేయాలని చెప్పారు. వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ కోసం కేంద్రానికి లేఖ రాస్తామని ఎంపీ కడియం కావ్య చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసహాయం రఘురామరెడ్డి, గడ్డం వంశీ, అనిల్‌కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
ప్రధానిని కలుద్దాం
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు, ఇతర సమస్యలపై ప్రధానమంత్రి సమయం తీసుకుని సమష్టిగా కలుద్దాం. రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ అలాట్‌మెంట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తే.. సంబంధిత మంత్రిని పార్టీలకు అతీతంగా కలసి లేఖ ఇద్దాం. అలాగే బొగ్గు అవసరాలకు సంబంధించి బొగ్గు శాఖ మంత్రిని కూడా కలుద్దాం. – మెదక్ ఎంపీ రఘునందన్ రావు
ప్రధానికి లేఖ ఇద్దాం
రఘునందన్ రావు చెప్పినట్టుగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై అఖిలపక్ష సభ్యులందరం కలిసి ప్రధానమంత్రికి లేఖ ఇద్దాం. మహబూబ్‌నగర్ ఎయిర్‌పోర్టుపై పూర్తి సమాచారం కోసం కేంద్రానికి లేఖ రాయాలి. గద్వాల–డోర్నకల్ రైల్వే లైన్ సర్వేపై సమాచారం ఇవ్వండి. – నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి
పోలవరం బ్యాక్ వాటర్‌తో నష్టం
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్ వల్ల నా నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా నష్టపో తారు. ప్రాజెక్టులో నీరు నింపితే లక్ష మందికి పైగా ముంపు బారిన పడే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం కావాలి. ములుగు – ఏటూరు నాగారం రహదారి నిర్మాణం..అటవీ, పర్యావరణ అనుమతులు రాకపోవడం వల్ల అలస్యం అవుతోంది. దీనిని పార్లమెంటులో ప్రస్తావిస్తాం. – మహబూబాబాద్ ఎంపీ బలరామ్‌నాయక్
పేదలకు ఉపాధి కరువు
రాష్ట్రంలో ఉపాధి హామీ కార్యక్రమంలో పని దినాలు బాగా తగ్గుతున్నాయి. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. పేదలకు ఉపాధి కరువవుతోంది. జహీరాబాద్–బీదర్ రహదారి అత్యంత కీలకమైంది. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తాం. – జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్


