హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం
కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తే నిర్లక్ష్యమా?
రోజంతా కోర్టు బయట నిలబెట్టాలని అనుకోవడంలేదు
తదుపరి విచారణకు రాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్
హైడ్రా కమిషనర్‌ను హెచ్చరించిన ద్విసభ్య ధర్మాసనం
‘బతుకమ్మకుంట’ ధిక్కరణ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానం ఉత్తర్వులంటే ఆటగా ఉందా.. హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని హైడ్రా కమి షనర్ రంగనాథ్‌పై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులపై గౌరవం ఉంచాలని.. అహంకార పూరితంగా వ్యవహరించొద్దని సూచించింది. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. వారిని ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించొచ్చని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే న్యాయస్థానం ఎప్పుడూ అలా ఆదేశాలివ్వలేదని.. కానీ, అవసరమైతే ఉత్తర్వులు ఇచ్చేందుకు వెనుకాడబోమంది. తదుపరి విచారణకు హాజరుకాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.
తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. బతుకమ్మకుంట భూ వివాద విషయంలో హైకోర్టు జూన్ 12న స్టేటస్‌కో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్‌పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ భూ హక్కులు కోరుతున్న ఎ.సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
గత విచారణ సందర్భంగా ధిక్కరణపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని చెప్పినా, రంగనాథ్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారిక అవసరాలు, అనివార్యమైన విపత్తు నిర్వహణ బాధ్యతల కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఆయన దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)ను కొట్టివేసింది. తన హాజరుతో కోర్టును ఇబ్బంది పెట్టకూడదని ఆయన భావిస్తున్నారన్న న్యాయవాది వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. తదుపరి విచారణకు హాజరుకాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.


