ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ వేదిక
5 అంశాలపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్న డీజీపీ శివధర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశ అంతర్గత భద్రత, వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం)ను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ భద్రత, సరిహద్దు నిర్వహణ సహా పలు కీలక అంశాలపై శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జాతీయ స్థాయిలో డీజీపీ, ఐజీల సదస్సు జరగనుంది. ఈ హై–ప్రొఫైల్ భద్రతా సమావేశాన్ని తొలిసారిగా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహిస్తున్నారు. సమావేశాల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ముగింపు కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్న నేపథ్యంలో.. అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
సమావేశంలో తెలంగాణ తరపున డీజీపీ బి.శివధర్‌రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్‌లు హాజరుకానున్నారు. సమావేశంలో భాగంగా మహిళా భద్రత, సైబర్ భద్రత, వామపక్ష తీవ్రవాదం సహా మొత్తం ఐదు అంశాలపై డీజీపీ శివధర్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. మావోయిస్టులపై సాయుధ పోలీస్ బలగాలు పూర్తిస్థాయిలో పట్టు సాధిస్తున్న నేపథ్యంలో.. మావోయిస్టుల సమస్యను పూర్తిగా రూపుమాపేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని పదేపదే ప్రకటిస్తున్న నేపథ్యంలో.. అధికారులకు ఈ విషయంలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపైనా కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారి తెలిపారు.


