కృష్ణా జలాల్లో తెలంగాణకు 279 టీఎంసీలు కేటాయించిన బచావత్ ట్రిబ్యునల్
1972 నుంచి 2008 మధ్య సగటున 286.90 టీఎంసీలు వినియోగించుకున్న తెలంగాణ
విభజనకు సాగునీటిలో చారిత్రకఅన్యాయం కారణం కాదు
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ వాదన
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందిందనడానికి రికార్డులే నిదర్శనమని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు కృష్ణా జలాల్లో 279 టీఎంసీలు కేటాయిస్తే.. 1972– 2008 మధ్య ఏటా సగటున 286.90 టీఎంసీలు వినియోగించుకుందని పేర్కొంది. రాష్ట్ర విభజనకూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకూ సాగునీటి రంగంలో జరిగిన చారిత్రక అన్యాయం కారణం కానే కాదని చెప్పింది.
ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనమై ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటైన సమయంలో తెలంగాణకు ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొంది. ఆ సమయంలో తెలంగాణ అభివృద్ధికి హామీ ఇచ్చినట్టుగా ఆ రాష్ట్రం ఎలాంటి రికార్డులు చూపించలేదని ఎత్తిచూపింది. కానీ.. ఉమ్మడి రాష్ట్రాన్ని 2014లో విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని విభజన చట్టం అందించిందని గుర్తు చేసింది.
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా మూడో రోజు తుది వాదనలు కొనసాగించారు. నీటిపారుదల రంగంలో అన్యాయం జరిగిందంటూ తెలంగాణ చేస్తున్న వాదన దురుద్దేశంతో కూడుకున్నదన్నారు.
హైదరాబాద్ రాష్ట్రం అధికారులదే నిర్లక్ష్యం..
తుంగభద్ర ఎడమ గట్టు ప్రధాన కాలువ పొడిగింపుగా ఎగువ కృష్ణ, భీమా ప్రాజెక్టులను బచావత్ ట్రిబ్యునల్ పరిగణించిందని జైదీ గుప్తా ట్రిబ్యునల్‌కు వివరించారు. ఆ ప్రాజెక్టులను 1956, నవంబర్ 1కి ముందు మంజూరు చేయలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల విషయంలో ఏదైనా నిర్లక్ష్యం ఉంటే అది ఆంధ్రప్రదేశ్ అధికారులది కాదని.. హైదరాబాద్ రాష్ట్ర అధికారులదేనని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనమైన తర్వాత తెలంగాణ అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తదుపరి విచారణను డిసెంబర్ 17–18 తేదీలకు వాయిదా వేసింది.
సాగర్‌పై సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సహకరించండి
ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాశయానికి కుడి వైపున ఏపీ భూభాగ పరిధిలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశంపై ఏపీ తన వైఖరిని పునఃసమీక్షించి తుది నిర్ణయాన్ని తెలియజేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కోరింది. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు కోసం నాగార్జునసాగర్ జలాశయంపై తమ ఇంజనీర్లు, సిబ్బందిని అనుమతించాలని తెలంగాణ విజ్ఞప్తి చేయగా, డిసెంబర్ 31 వరకు ఏపీ వైపు ఉన్న డ్యామ్‌పై వారికి కృష్ణాబోర్డు గతంలో అనుమతించింది.
ఈ మేరకు డ్యామ్‌పై బందోబస్తు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ కమాండింగ్ అధికారికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. దీనికి ఏపీ సహకరించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో గత జనవరి 21న జరిగిన కృష్ణాబోర్డు సమావేశంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ఏపీ అంగీకరించిన విషయాన్ని గుర్తు చేస్తూ బోర్డు తాజాగా ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి లేఖ రాసింది. ఈ మేరకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని ఏపీని కోరింది.


