సీఎం కాదు.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌లా రేవంత్‌ | BRS Working President KTR comments over Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం కాదు.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌లా రేవంత్‌

Nov 28 2025 4:38 AM | Updated on Nov 28 2025 4:38 AM

BRS Working President KTR comments over Revanth Reddy

పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పుతున్న కేటీఆర్‌

ప్రజా ఆస్తులైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర 

పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్ప.. రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు 

చేరికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఒక సీఎంలా కాకుండా కేవలం రియ ల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణభవన్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి హిల్ట్‌ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజినల్‌ రింగ్‌ రోడ్డు, సెంట్రల్‌ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్‌ దృష్టి.. ఇప్పుడు హైదరాబాద్‌లోని పారిశ్రామిక భూములను దోచుకోవడంపై పడిందని విమర్శించారు. ఒకప్పుడు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలు చౌకగా భూములు తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూముల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు రేవంత్‌రెడ్డి అతి తక్కువ ధరకే అనుమతులు ఇస్తూ రియల్‌ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దాదాపు 9,300 ఎకరాల భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, ఐదారు వందల మంది కోసం 5 లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సగం డబ్బులు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయని, ఎవరి అబ్బ సొత్తని ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

పాలమూరుకు రేవంత్‌ చేసింది శూన్యం  
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్‌ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్‌ మైగ్రేషన్‌ సాధ్యమైందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్‌రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 

రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప.. ఇప్పటివరకు రైతులకు చుక్కనీరు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్‌టి.రామారావు వంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తలకు కేటీఆర్‌ ధైర్యం చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్‌ కష్టాలు లేకుండా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్‌ ఇచ్చిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది అని గుర్తు చేశారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కరెంట్‌ కోతలు, రైతుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, ప్రజలు కేసీఆర్‌ పాలనను గుర్తు చేసుకుంటున్నారన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైన లేనంత ప్రజావ్యతిరేకత కాంగ్రెస్‌పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే.. వారే తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటారని చెప్పారు. 

రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతోపాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేసుకోబోతున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైఫల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.   

బీఆర్‌ఎస్వీ విభాగం పాటను ఆవిష్కరించిన కేటీఆర్‌ 
సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్వీ విభాగం పాటను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ పాటను బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్‌ రూపొందించారు. గురువారం నందినగర్‌ కేటీఆర్‌ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, బీఆర్‌ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీష్, బీఆర్‌ఎస్‌వై రాష్ట్ర నాయకులు వల్లమల్ల కృష్ణ, బీఆర్‌ఎస్వీ నేతలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement