ఐఎస్‌కేపీ ఉగ్రవాదులకు నేర్పిన హ్యాండ్లర్ ఖదీజా
దీనికి సంబంధించి పీడీఎఫ్ డాక్యుమెంట్లూ షేర్
దర్యాప్తులో గుర్తించిన అహ్మదాబాద్ ఏటీఎస్
కోలుకున్న హైదరాబాదీ డాక్టర్ మహ్మద్ సయ్యద్
రిసిన్ నమూనాలు గుజరాత్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు
సాక్షి, హైదరాబాద్: ఆహార, పండ్ల మార్కెట్లను టార్గెట్‌గా చేసుకుని రిసిన్ విషాన్ని ప్రయోగించడం ద్వారా భారీ ప్రాణనష్టం కల్పించాలని కుట్ర పన్ని అహ్మదాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు (ఏటీఎస్) చిక్కిన ముగ్గురు ఉగ్రవాదుల విచారణలో కీల క విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్‌కేపీ) మాడ్యూల్‌కు చెందిన ఈ ఉగ్రవాదులకు పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో ఉన్న అబు ఖదీజా హ్యాండ్లర్‌గా వ్యవహరించాడు. ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఉనికి బయటపడకుండా గడపాలని చెప్పిన అతగాడు.. అదెలా అ నేది వివరించే కొన్ని డాక్యుమెంట్లను షేర్ చేశాడు.
సోషల్ మీడియా ఖాతాల విశ్లేషణ...
ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో నగరాలను టార్గెట్‌గా చేసుకుని భారీ కుట్ర పన్నిన ఈ మాడ్యూల్‌ను ఏటీఎస్ అధికారులు ఈ నెల 9న అరెస్టు చేశారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహ్మద్ సుహైల్ ఖాన్‌లతో పాటు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ కూడా ఉన్నాడు. ఇప్పటికే వీరిని వివిధ కోణాల్లో ప్రశ్నించిన ఏటీఎస్ అధికారులు ప్రస్తుతం వారి వద్ద నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, వారి సోషల్ మీడియా ఖాతాలను విశ్లేషిస్తున్నారు.
సయ్యద్ ఫోన్‌లో అబు ఖదీజా పంపిన కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన ఏటీఎస్ వాటిలో ‘హౌ టు స్టే అనానిమస్’పేరుతో ఒకటి ఉన్నట్లు గుర్తించారు. ఇతరుల దృష్టిని ఆకర్షించకుండా, పోలీసుల నిఘాకు చిక్కకుండా ఎలా ఉండాలనే అంశాలు అందులో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అహ్మదాబాద్ కోర్టుకు నివేదించారు. ఈ డాక్యుమెంట్‌ను సయ్యద్ మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులకు పంపినట్లు తేల్చారు.
హోటల్ నుంచి కీలక ఆధారాలు...
సయ్యద్ గతంలోనూ అనేకసార్లు అహ్మదాబాద్‌కు వెళ్లి వచ్చాడు. ఆయా సందర్భాల్లో ఇతడు ఎక్కువగా అహ్మదాబాద్‌లోని మీర్జాపూర్ ప్రాంతంలో ఉన్న హోటల్ గ్రాండ్ ఆంబియన్స్‌లోనే బస చేశాడు. ఈ నెల 9న అరెస్టుకు ముందు అతడు ఆ హోటల్ నుంచి రాకపోకలు సాగిస్తున్న సీసీ కెమెరా ఫుటేజ్ ఏటీఎస్‌కు లభించింది. అలాగే రూమ్ బుక్ చేసుకునే సమయంలో సయ్యద్ ఇచ్చిన గుర్తింపుకార్డు, రిజిస్టర్‌లో అతడు చేసిన సంతకం తదితరాలను ఏటీఎస్ సేకరించింది. ఈ కేసులో నేరం నిరూపించడానికి ఇవన్నీ కీలక ఆ«ధారాలు అవుతాయని అధికారులు చెప్తున్నారు. యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఉన్న మరో ఉగ్రవాది సుహైల్ ఇంటి నుంచి ‘నల్ల జెండా, డిజిటల్ సాహిత్యం’రికవరీ అయ్యాయి. ఏటీఎస్ అధికారులు రాజేంద్రనగర్‌లోని సయ్యద్ ఇంటి నుంచి స్వా«దీనం చేసుకున్న రిసిన్‌తో పాటు అనుమానిత ద్రవాలు, ఇతర పదార్థాల రసాయన విశ్లేషణ చేయించనున్నారు. దీనికోసం వాటి నమూనాలకు అహ్మదాబాద్‌లో ఉన్న గుజరాత్ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీకి పంపారు.
గాయాల నుంచి కోలుకున్న సయ్యద్...
డాక్టర్ సయ్యద్‌తో పాటు మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులను అహ్మదాబాద్ ఏటీఎస్ అధికారులు అక్కడి సబర్మతి సెంట్రల్ జైలులో ఉంచారు. ఈ సెల్‌లో ఈ ముగ్గురితో పాటు మరో ఉగ్రవాదినీ నిర్బంధించారు. ఈనెల 18న మిగిలిన ముగ్గురితో సయ్యద్‌కు వాగ్వాదం జరిగింది. దీంతో వాళ్లు ఇతడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ముఖం, మెడ సహా అనేక చోట్ల గాయాలైన సయ్యద్‌ను జైలు అధికారులు అ క్కడి ఆస్పత్రికి తరలించారు. సయ్యద్‌ను వైద్యులు 2 రోజులకే డిశ్చార్జ్ చేయగా... ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. ఈ మాడ్యూల్‌లో సంబంధాలు కలిగి ఉన్న మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది.


