రూ.12 లక్షల నుంచి రూ.కోటి వరకు..
గ్రామాభివృద్ధికి ఆ డబ్బుఖర్చు చేసేలా ఒప్పందాలు
బయ్యారం మండలంలోఒక వీధిలోనే రెండు గ్రామాలు
అధికార పార్టీ తరఫున అభ్యర్థిగారంగంలో దిగేందుకు పోటాపోటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ రాయపర్తి/ రుద్రంగి/ తరిగొప్పుల/ కైలాస్‌నగర్: సర్పంచ్ పదవులకు వేలం పాటలు జోరు గా సాగుతున్నాయి. ఆశావహులు పోటాపోటీగా లక్షలకు లక్ష లు గ్రామాభివృద్ధికి చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని పంచాయతీ పరిధిలలో పార్టీ బలపరిచే అభ్యర్థుల ఎంపికకు ఓటింగ్ చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు ఎక్కువమంది పోటీలో ఉండటంతో ఇలా చేస్తున్నారు.
» మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర్ గ్రామ సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ కాగా.. ఓ భూస్వామి, ధా న్యం వ్యాపారి వేలంపాటలో రూ.కోటికి దక్కించుకున్నారు. ఆంజనేయ ఆలయ నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించేలా.. సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేలా పెద్దలతో ఒప్పందం చేసుకున్నాడు.
» జోగుళాంబ గద్వాల జిల్లాలోని కొండపల్లిలో గ్రామ సర్పంచ్ పదవిని రూ.60 లక్షలు.. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డిలో రూ.57 లక్షలు.. ముచ్చోనిపల్లిలో రూ.14.90 లక్షలు.. కేటీదొడ్డి మండలం చింతలకుంటలో రూ.38 లక్షలు.. ఉమిత్యాల తండాలో గ్రామ సర్పంచ్ పదవిని రూ.12 లక్షలకు ఆయా గ్రామాలకు చెందిన వ్యక్తులు వేలం పాడారు. కాగా.. గొర్లఖాన్‌దొడ్డిలో గ్రామసర్పంచ్ పదవి వేలం విషయాన్ని ఎవరైనా బయటపెడితే రూ.లక్ష జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు తీర్మానించారు.
» వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచ్‌గా కొండం రంగారెడ్డితోపాటు వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు రంగారెడ్డి అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు చెప్పారు.
» రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గైదిగుట్టతండా, సర్పంచ్‌తండా, చింతామణితండా గ్రామపంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఎన్నికల్లో ఖర్చులు, ప్రలోభాలకు తావులేకుండా అందరం సమావేశమై గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉన్న వ్యక్తులను సర్పంచ్‌లుగా ఎన్నుకున్నట్టు మూడు గ్రామాల ప్రజలు చెప్పారు.
» మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పంచాయతీలోని లక్ష్మీనర్సింహపురం గ్రామంలోని ఓ వీధి ఒక వైపు ఉప్పలపాడు పంచాయతీ పరిధిలో ఉండగా, మరోవీధి మహబూబాబాద్ మండలం బోడగుట్టతండా పంచాయతీలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆ వీధిలో ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు వార్డు సభ్యులు ఎన్నిక కానున్నారు.
» జనగామ జిల్లా తరిగొప్పుల మండలం మాన్సింగ్‌తండా సర్పంచ్‌గా కత్తుల కొమురయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దుర్గమ్మ గుడి నిర్మాణానికి రూ.10 లక్షలు, 2 గుంటల భూమిని విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ గ్రామంలో 6 వార్డులుండగా, ఇవి కూడా ఏకగ్రీవమయ్యాయి.
» ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో తేజాపూర్, మెండపలి, వల్గొండలతోపాటు సిరికొండ మండలంలో రాయిగూడ, రిమ్మ, కుంటగూడ, కన్నాపూర్ గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానాలు చేశారు.
సీతంపేటలో చిత్ర విచిత్రాలు
» 40% బీసీలున్నా..ఒక్కవార్డు రిజర్వు కాని వైనం
» ఎస్సీలు లేని వార్డుల్లో ఎస్సీ రిజర్వేషన్
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామ జనాభా 3,241. వీరిలో 2474 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీ జనాభా 40 శాతం ఉంది. పంచాయతీ పరిధిలో 10 వార్డుల్లో ఐదు స్థానాలను జనరల్ (మూడు జనరల్, రెండు జనరల్ మహిళ)కు కేటాయించారు. మరో ఐదు స్థానాలను ఎస్సీ (మూడు ఎస్సీ జనరల్, రెండు ఎస్సీ మహిళ)లకు రిజర్వు చేశారు. అయితే 1వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డుల్లో ఒక్క ఎస్సీ ఓటరూ కూడా లేరు. ఈ మూడు వార్డులు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి.
ముడుపుగల్లులో టాస్ వేసి సర్పంచ్ అభ్యర్థి ఎంపిక
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం ముడుపుగల్లులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇద్దరు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో రహస్య ఓటింగ్ నిర్వహించగా 152 మంది ఓట్లు వేశారు. ఇందులో జేరిపోతుల ఉపేందర్, కొత్త హేమంత్‌లకు చెరి 76 చొప్పున ఓట్లు రాగా, చివరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టకంటి రామిరెడ్డి, గ్రామస్తుల సమక్షంలో టాస్ వేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికే సర్పంచ్ అభ్యర్థిగా కొత్త హేమంత్‌ను ఎంపిక చేశారు. అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
అభ్యర్థి ఎంపికకూ ఓటింగ్
కనగల్: నల్లగొండ జి ల్లా కనగల్ మండల జి.ఎడవెల్లిలో సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు తీ వ్రంగా పోటీ పడుతు న్నారు. దీంతో ఎన్నికలకు ముందే నమూనా బ్యాలెట్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయనున్నారు. శుక్రవారం ఉదయం గ్రామంలోని ఓ ఫంక్షన్ హాలులో గ్రామ ప్రజలచే నమూనా బ్యాలెట్‌పై ఓటు వేయించనున్నారు. మెజారిటీ ఓట్లు వచ్చిన వ్యక్తిని సర్పంచ్ అభ్యరి్థగా బరిలో దింపుతామని స్థానిక నేతలు చెప్పారు.


