హైకోర్టు స్పష్టీకరణ
రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఇదే అంశంపై విచారణ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నందున.. తాజా పిటిషన్లలో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చనేది పరిశీలిస్తామని జస్టిస్ టి.మాధవీదేవి వెల్లడించారు.
అవసరమైన వాటిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెబుతూ విచారణ వాయిదా వేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకుని రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 23న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ లంచ్‌మోషన్ రూపంలో పలు పిటిషన్లు దాఖ లయ్యాయి. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి మధ్యాహ్నం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సామల రవీందర్, ఇతరులు వాదనలు వినిపించారు.
బీసీలకు 23% కూడా కేటాయించలేదు
‘బీసీలకు 23 శాతం కూడా పంచాయతీ స్థానాలు కేటాయించలేదు. కొన్ని జిల్లాల్లో 13 శాతమే రిజర్వు చేశారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీల కంటే బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా స్థానాలు తక్కువే కేటాయించారు. ఓ గ్రామంలో 2014లో ఎస్టీ మహిళ, 2019లో జనరల్ మహిళకు రిజర్వ్ చేస్తే ఇప్పుడు ఎస్సీలకు రిజర్వు చేశారు. వాస్తవానికి ఆ ఊరిలో బీసీల సంఖ్య ఎక్కువ. ప్రభుత్వం విడుదల చేసిన జీవో, షెడ్యూల్ నిబంధనలకు విరుద్ధం..’అని పేర్కొన్నారు.
రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా..
ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘చట్టప్రకా రం 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు పాటిస్తూ పంచాయతీ స్థానాలు కేటాయించాం. ముందు ఎస్టీకి, తర్వాత ఎస్సీకి, అనంతరం బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే రిజర్వేషన్లు ఇచ్చాం..’ అని నివేదించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ‘బీసీలకు 23 శాతం ఇవ్వాలని చట్టంలో లేదు’అని పేర్కొన్నారు.
మహమూద్ పట్నం జీపీ ఎన్నికలు నిలిపివేత
వాదనలు విన్న న్యాయమూర్తి.. తొలుత ఈ పిటిషన్లు సీజే ధర్మాసనం ముందు పెడితే బాగుంటుందేమోనని అభిప్రాయపడ్డారు. తర్వాత మొదటి కోర్టులో రిజ ర్వేషన్ల పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్నందున సింగిల్ జడ్జిగా ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చో పరిశీలన జరిపి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. అయితే బీసీ కమిషన్ నివేదికను సమరి్పంచాల్సిందిగా ప్రభుత్వా న్ని ఆదేశించారు.
అదే సమయంలో వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నంలో ఆరుగురు ఎస్టీలుంటే, సర్పంచ్ పోస్టుతో పాటు మూడు వార్డులను వారికే కేటాయించడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కేటాయించడం సరికాదన్నారు. దీనిపై సమరి్పంచిన వినతిపత్రంలో నిర్ణయం తీసుకునేదాకా ఆ పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు.


