రూ. 3.20 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్
వరల్డ్ కప్ స్టార్‌కు వేలంలో భారీ మొత్తం
శ్రీచరణి రూ.1.30 కోట్లతో ఢిల్లీ జట్టుకు
వేలంలో మొత్తం 67 మంది ఎంపిక
ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ దీప్తి శర్మకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారీ విలువ దక్కింది. 2026 సీజన్ కోసం నిర్వహించిన మెగా వేలంలో దీప్తిని అత్యధికంగా రూ.3 కోట్ల 20 లక్షలకు ఆమె గత జట్టు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక మొత్తం 2023లో స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు)కు దక్కగా... దీప్తి రెండో స్థానంలో నిలిచింది.
కెప్టెన్‌గా మూడుసార్లు ఢిల్లీని ఫైనల్‌కు చేర్చిన ఆ్రస్టేలియా దిగ్గజం మెగ్ లానింగ్‌ను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ తమ సారథిగా ఎంచుకునే అవకాశం ఉంది. వరల్డ్ కప్ విజయంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్లు ఇచ్చి మళ్లీ తమ జట్టులోకి తీసుకుంది.
న్యూఢిల్లీ: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) –2026 సీజన్ కోసం గురువారం నిర్వహించిన వేలంలో 67 మంది మహిళా క్రికెటర్లను ఐదు ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరిలో 23 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 276 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా, గరిష్టంగా 73 ఖాళీలు ఉండగా... తమకు కావాల్సిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు టీమ్‌లు ఓవరాల్‌గా రూ.40.80 కోట్లు ఖర్చు చేశాయి.
భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు అత్యధికంగా రూ.3.20 కోట్లు దక్కాయి. విదేశీ ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్టార్ అమేలియా కెర్‌కు రూ. 3 కోట్లు లభించగా... 11 మంది ప్లేయర్లకు కనీసం రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలు దక్కాయి.
వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు రెండు నగరాల్లో డబ్ల్యూపీఎల్ జరుగుతుంది. ముంబైలోని డీవై పాటిల్, వడోదరలోని కొటాంబి స్టేడియంలను టోర్నీకి వేదికలుగా నిర్ణయించారు. 2023లో మొదటిసారి డబ్ల్యూపీఎల్ వేలం జరిగింది. ఆ తర్వాత జరిగిన మెగా వేలం ఇదే కావడం గమనార్హం. తొలిసారి జట్లకు రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కార్డును వాడుకునే అవకాశం కల్పించారు. వేలానికి ముందు యూపీ వారియర్స్ వద్ద ఏకంగా రూ.14.50 కోట్లు ఉండటంతో ఆ జట్టు చురుగ్గా పాల్గొని గరిష్టంగా 17 మంది ఆటగాళ్లను ఎంచుకుంది.
డబ్ల్యూపీఎల్ వేలం విశేషాలు
» ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీతో వేలం మొదలైంది. వన్డే వరల్డ్ కప్‌లో చెలరేగిన ఆమె ప్రాథమిక ధర రూ.50 లక్షలు కాగా... ఏ జట్టు కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
» దీప్తి కోసం 2023లో యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ సీజన్‌కు ముందు ఆమెను విడుదల చేసింది. వేలంలో దీప్తి కనీస విలువ రూ. 50 లక్షలకు తీసుకునేందుకు ఢిల్లీ సిద్ధం కాగా... యూపీ ఆర్‌టీఎం కార్డును వాడుకొని తమ జట్టులోకి ఎంచుకుంది.
» డబ్ల్యూపీఎల్‌లో మూడుసార్లు కెప్టెన్‌గా ఢిల్లీని ఫైనల్ చేర్చిన ఆసీస్ దిగ్గజం మెగ్ లానింగ్ కనీస ధర రూ.50 లక్షల నుంచి ఢిల్లీ, యూపీ పోటీ పడగా, చివరకు రూ.1.9 కోట్లతో యూపీ సొంతమైంది.
» వేలంలో భారీ మొత్తం పలికిన ప్లేయర్ల జాబితాలో శిఖా పాండే కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. భారత జట్టుకు ఎప్పుడో దూరమైన 36 ఏళ్ల శిఖా అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు మూడేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం కరీబియన్ లీగ్ సహా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతూ ఫిట్‌గా ఉండటం ఆమె ఎంపికకు ప్రధాన కారణం. ఆర్‌సీబీతో పోటీ పడిన యూపీ చివరకు శిఖాను సొంతం చేసుకుంది.
శ్రీచరణి స్థాయి పెరిగింది...
వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన నల్లపు రెడ్డి శ్రీచరణి 2025 డబ్ల్యూపీఎల్‌లో రూ.55 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రధాన పాత్ర పోషించడంతో సహజంగానే ఆమె స్థాయి పెరిగింది. వేలానికి ముందు ఆమెను విడుదల చేసిన ఢిల్లీ ఇక్కడ మళ్లీ పోటీ పడింది. కనీస విలువ రూ.30 లక్షలతో మొదలై ఢిల్లీ, యూపీ మధ్య పోరు సాగింది. చివరకు రూ.1.30 కోట్ల వద్ద వేలం ముగిసింది.

మన అమ్మాయిలకు అవకాశం...
డబ్ల్యూపీఎల్ వేలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అమ్మాయిలు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల వన్డే వరల్డ్ కప్ విజయంలో భాగమైన శ్రీచరణి, అరుంధతి రెడ్డి (హైదరాబాద్) మరో సందేహం లేకుండా ఎంపికయ్యారు. అరుంధతి రెడ్డిని రూ. 75 లక్షలకు ఆర్‌సీబీ జట్టు ఎంచుకుంది.
అండర్–19 వరల్డ్ కప్ విజయంలో భాగమైన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషకు తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో చాన్స్ లభించడం విశేషం. మమత మాదివాల, నల్లా క్రాంతి రెడ్డి కూడా ఎంపికయ్యారు. త్రిషను రూ. 10 లక్షలకు యూపీ వారియర్స్... మమతను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్... క్రాంతి రెడ్డిని రూ. 10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి.
వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల వివరాలు (విలువ రూ.లలో)
ఢిల్లీ క్యాపిటల్స్: షినెల్ హెన్రీ (1.30 కోట్లు), శ్రీచరణి (1.30 కోట్లు), వోల్‌వార్ట్ (1.10 కోట్లు), స్నేహ్ రాణా (50 లక్షలు), మిన్ను మణి (40 లక్షలు), లిజెల్ లీ (30 లక్షలు), తానియా భాటియా (30 లక్షలు), నందిని శర్మ (20 లక్షలు), దియా యాదవ్ (10 లక్షలు), మమత మదివాల (10 లక్షలు), లూసీ హామిల్టన్ (10 లక్షలు).
గుజరాత్ జెయింట్స్: సోఫీ డివైన్ (2 కోట్లు), జార్జ్ వేర్‌హామ్ (1 కోటి), భారతి ఫుల్‌మలీ (70 లక్షలు), కాశ్వీ గౌతమ్ (65 లక్షలు), రేణుకా సింగ్ (60 లక్షలు), కిమ్ గార్త్ (50 లక్షలు), యస్తిక భాటియా (50 లక్షలు), డానీ వ్యాట్ (50 లక్షలు), తనూజ కన్వర్ (45 లక్షలు), అనుష్క శర్మ (45 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్ (40 లక్షలు), టిటాస్ సాధు (30 లక్షలు), కనిక అహుజా (30 లక్షలు), ఆయుషి సోని (30 లక్షలు), హ్యాపీ కుమారి (10 లక్షలు), శివాని సింగ్ (10 లక్షలు).
ముంబై ఇండియన్స్: అమేలియా కెర్ (3 కోట్లు), సజీవన్ సజన (75 లక్షలు), షబి్నమ్ ఇస్మాయిల్ (60 లక్షలు), నికోలా క్యారీ (30 లక్షలు), సైకా ఇషాక్ (30 లక్షలు), సంస్కృతి గుప్తా (20 లక్షలు), త్రివేణి వశిష్ట (20 లక్షలు), రాహిలా ఫిర్దోస్ (10 లక్షలు), పూనమ్ ఖెమ్మార్ (10 లక్షలు), నల్లా క్రాంతి రెడ్డి (10 లక్షలు), మిలీ ఇలింగ్‌వర్త్ (10 లక్షలు).
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: లారెన్ బెల్ (90 లక్షలు), పూజ వస్త్రకర్ (85 లక్షలు), అరుంధతి రెడ్డి (75 లక్షలు), గ్రేస్ హారిస్ (75 లక్షలు), డిక్లెర్క్ (65 లక్షలు), రాధ యాదవ్ (65 లక్షలు), జార్జ్ వోల్ (60 లక్షలు), లిన్సీ స్మిత్ (30 లక్షలు), హేమలత దయాళన్ (30 లక్షలు), ప్రేమ రావత్ (20 లక్షలు), గౌతమ్ నాయక్ (10 లక్షలు), ప్రత్యూష కుమార్ (10 లక్షలు).
యూపీ వారియర్స్: దీప్తి శర్మ (3.20 కోట్లు), శిఖా పాండే (2.40 కోట్లు), మెగ్ లానింగ్ (1.90 కోట్లు), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (1.20 కోట్లు), ఆశా శోభన (1.10 కోట్లు), సోఫీ ఎకెల్‌స్టోన్ (85 లక్షలు), డియాండ్రా డాటిన్ (80 లక్షలు), కిరణ్ నవ్‌గిరే (60 లక్షలు), హర్లీన్ డియోల్ (50 లక్షలు), క్రాంతి గౌడ్ (50 లక్షలు), ప్రతీక రావల్ (50 లక్షలు), క్లో ట్రయాన్ (30 లక్షలు), శిప్రా గిరి (10 లక్షలు), సిమ్రన్ షేక్ (10 లక్షలు), తారా నోరిస్ (10 లక్షలు), సుమన్ మీనా (10 లక్షలు), గొంగడి త్రిష (రూ. 10 లక్షలు).
వీరికి నిరాశ అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన
గుర్తింపు ఉన్న పలువురు ప్లేయర్లకు ఈసారి డబ్ల్యూపీఎల్ వేలంలో నిరాశే మిగిలింది. అలీసా హీలీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా ...విదేశీ ప్లేయర్లలో ఎమీ జోన్స్, హీతర్ నైట్, చమరి అటపట్టు, అలానా కింగ్, తజ్‌మీన్ బ్రిట్స్, సోఫీయా డంక్లీ, సుజీ బేట్స్ తది తరులను ఎవరూ పట్టించుకోలేదు.
గతంలో లీగ్‌లో అవకాశం దక్కించుకొని ఈసారి వేలంలో ఎంపిక కాని భారత ప్లేయర్ల జాబితాలో ఉమా ఛెత్రి, సైమా ఠాకూర్‌లతోపాటు సబ్బినేని మేఘన, స్నేహ దీప్తి, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్), యషశ్రీ (హైదరాబాద్) ఉన్నారు.


