భారత ఆల్‌రౌండర్‌ ప్రపంచ రికార్డు | Deepti Sharma Breaks World Record Becomes Highest Wicket Taker In Women’s T20Is As India Clinch Series, Video Went Viral | Sakshi
Sakshi News home page

లంకను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. దీప్తి శర్మ వరల్డ్‌ రికార్డు

Dec 31 2025 9:13 AM | Updated on Dec 31 2025 10:06 AM

Deepti Sharma Breaks World Record Becomes Highest Wicket Taker In

భారత మహిళా క్రికెట్‌ జట్టు (PC: ICC)

శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భారత మహిళా జట్టు పరిపూర్ణ విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో పదిహేను పరుగుల తేడాతో నెగ్గి మరోసారి ఆధిపత్యం కనబరిచింది. సిరీస్‌ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో రాణించి 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగా భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ప్రపంచ రికార్డు సాధించింది. శ్రీలంక బ్యాటర్‌ నీలాక్షిక సిల్వాను లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనక్కి పంపిన ఈ రైటార్మ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌.. అంతర్జాతీయ టీ20లలో 152వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

 

తద్వారా మహిళల ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్‌ మేగన్‌ షట్‌ (151) పేరిట ఉండేది.

హర్మన్‌, అమన్‌, అరుంధతి మెరుపులు
కాగా లంకతో ఐదో టీ20లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (5), జి.కమలిని (12).. వన్‌డౌన్‌లో వచ్చిన హర్లిన్‌ డియోల్‌ (13) తీవ్రంగా నిరాశపరిచారు.

మిగతా వారిలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ (5), దీప్తి శర్మ (7) విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట దశలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (43 బంతుల్లో 68) బాధ్యతాయుతంగా ఆడింది. ఆమెకు తోడుగా అమన్‌జోత్‌ కౌర్‌ (18 బంతుల్లో 21), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్‌) రాణించారు.

సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్‌ 175 పరుగులు స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్‌ హాసిని పెరీరా (65), వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇమేషా దులాని (50) అర్ధ శతకాలు వృథా అయ్యాయి.

భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్‌ రాణా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్‌జోత్‌ కౌర్‌.. తలా ఒక వికెట్‌ తీసి సమిష్టిగా రాణించారు.

నంబర్‌ వన్‌ ర్యాంకులోనే దీప్తి శర్మ
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజా మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సమష్టిగా చెలరేగడంతో భారత ప్లేయర్ల ర్యాంకింగ్‌లు మెరుగయ్యాయి. 738 రేటింగ్‌ పాయింట్లతో దీప్తి నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా, భారత పేసర్‌ రేణుకా సింగ్‌ ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకుంది.

705 పాయింట్లతో రేణుక...ఎంలాబా (దక్షిణాఫ్రికా)తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్‌ క్రీడాకారిణి హేలీ మాథ్యూస్‌ (505 ర్యాంకింగ్‌ పాయింట్లు) తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. 

బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో షఫాలీ వర్మ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుంది. ఇప్పటి వరకు పదో స్థానంలో ఉన్న ఆమె 736 రేటింగ్‌ పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. ఒక స్థానం కోల్పోయిన జెమీమా రోడ్రిగ్స్‌ పదో ర్యాంక్‌కు పరిమితం అయింది.  

చదవండి: సచిన్‌ ఆల్‌టైమ్‌ వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన కోహ్లి.. ఇంకో 25 పరుగులే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement