ఆరోజు అందుకే అబద్ధం చెప్పాను: హ్యారీ బ్రూక్‌ | I Lied: Brook Makes Shocking Admission Over Nightclub Incident | Sakshi
Sakshi News home page

ఆరోజు అందుకే అబద్ధం చెప్పాను: హ్యారీ బ్రూక్‌

Jan 31 2026 3:22 PM | Updated on Jan 31 2026 3:41 PM

I Lied: Brook Makes Shocking Admission Over Nightclub Incident

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ మాట మార్చాడు. నైట్‌క్లబ్‌ గొడవ విషయంలో గతంలో తాను అబద్ధం చెప్పినట్లు అంగీకరించాడు. సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే తాను ఆరోజు అలా మాట్లాడినట్లు తాజాగా స్పష్టం చేశాడు.

దెబ్బలు తిన్న బ్రూక్‌
గతేడాది ఇంగ్లండ్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మూడో వన్డేకు ముందు (అక్టోబరు 31 రాత్రి) హ్యారీ బ్రూక్‌ (Harry Brook) ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లాడు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మద్యం తాగాడనే అనుమానంతో ఓ బౌన్సర్‌ అతడిని అడ్డుకున్నాడు. దీంతో బ్రూక్‌ వాగ్వాదానికి దిగగా.. సదరు బౌన్సర్‌ అతడిని కొట్టినట్లు వార్తలు వచ్చాయి.

హద్దుమీరి ప్రవర్తించాను
ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత.. యాషెస్‌ టెస్టు సిరీస్‌ సమయంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘ఆరోజు నేను హద్దుమీరి ప్రవర్తించాను. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. నా ప్రవర్తన నా జట్టు, దేశానికి తలవంపులు తీసుకువచ్చింది.

కెప్టెన్‌గా నాకు దక్కిన గౌరవానికి భంగం కలగకుండా ఇకపై ఇలాంటి తప్పులు చేయబోను’’ అని బ్రూక్‌ మీడియా ముఖంగా తెలియజేశాడు. ఆ సమయంలో నైట్‌క్లబ్‌కు తాను ఒక్కడినే వెళ్లినట్లు పేర్కొన్నాడు. అయితే, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు.. బ్రూక్‌కు రూ. 33 లక్షల మేర జరిమానా విధించింది. అంతేకాదు.. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

జేకబ్‌ బెతెల్‌, జోష్‌ టంగ్‌ కూడా
అయితే, ఈ విషయంపై టెలిగ్రాఫ్‌ తాజాగా ఓ కథనం ప్రచురించింది. బ్రూక్‌తో పాటు జేకబ్‌ బెతెల్‌, జోష్‌ టంగ్‌ కూడా ఉన్నారని.. వారికి కూడా ఫైన్‌ పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో శుక్రవారం నాటి తొలి టీ20లో విజయం తర్వాత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ స్పందించాడు.

‘‘వెల్లింగ్‌టన్‌లో నా చర్యలకు నేనే పూర్తి బాధ్యత వహిస్తాను. ఆరోజు నాతో పాటు ఇతరులు కూడా ఉన్నారని నేను అంగీకరిస్తున్నా. గతంలో నేను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా.

గుణపాఠాలు నేర్చుకుంటున్నా
అయితే, ఆరోజు నా సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే అలా అబద్ధం చెప్పాను. వారిని వివాదంలోకి లాగవద్దని భావించాను. ఈ విషయంలో నేను మళ్లీ క్షమాపణలు కోరుతున్నా. నా కెరీర్‌లో ఇప్పుడు కఠిన, సవాలుతో కూడిన దశ నడుస్తోంది. దీని నుంచి నేను ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటున్నా’’ అని హ్యారీ బ్రూక్‌ వెల్లడించాడు.

చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement