ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ స్టార్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్దానాన్ని సదర్లాండ్ కైవసం చేసుకుంది.
సదర్లాండ్ 736 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. దీప్తీ శర్మ(735) రెండో స్ధానంలో ఉంది. దీప్తీకి ఆసీస్ ప్లేయర్‌కు కేవలం ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఇటీవల శ్రీలంక మహిళలతో జరిగిన టీ20 సిరీస్‌లో శర్మ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో తన టాప్ ర్యాంక్‌ను కోల్పోవల్సి వచ్చింది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆమె కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టింది. మరోవైపు, భారత బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్ ఐదు స్థానాలు దిగజారి 11వ స్థానానికి, రాధా యాదవ్ రెండు స్థానాలు తగ్గి 18వ స్థానానికి పడిపోయారు.
ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం మన అమ్మాయిలు అదరగొట్టారు. శ్రీలంకతో సిరీస్‌లో దుమ్ములేపిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ సిరీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన షఫాలీ తన 6వ స్ధానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ క్రికెటర్ అరుంధతీ రెడ్డి సత్తాచాటింది. ఆల్ రౌండర్ల జాబితాలో ఆమె ఏకంగా 44 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకుంది.
చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు


