‘ఆర్సీబీ’కి దెబ్బే.. ఆ ప్లేయర్‌కు ఎవరూ సాటిరారు! | She cant be same player: Aakash Chopra on RCB Replacement for Ellyse Perry | Sakshi
Sakshi News home page

RCB: స్కిల్‌ సెట్‌ ఒకటే.. కానీ ఆ ప్లేయర్‌కు ఎవరూ సాటిరారు!

Dec 31 2025 4:05 PM | Updated on Dec 31 2025 4:42 PM

She cant be same player: Aakash Chopra on RCB Replacement for Ellyse Perry

కెప్టెన్‌ స్మృతి మంధానతో పెర్రీ (PC: BCCI)

వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)కి చిక్కులు తప్పవని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఎలిస్‌ పెర్రీ లేనిలోటును ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూపీఎల్‌ తాజా సీజన్‌ ఆరంభానికి ముందే ఆర్సీబీ కీలక ప్లేయర్‌ సేవలు కోల్పోయింది. వ్యక్తిగత కారణాలతో ఈ ఎడిషన్‌ నుంచి పూర్తిగా తప్పుకొంటున్న ఆస్ట్రేలియా స్టార్‌ పెర్రీ ప్రకటించింది.

అత్యధిక పరుగులు
గత మూడు సీజన్లుగా తమతోనే కొనసాగుతున్న పెర్రీని ఆర్సీబీ.. ఈ ఏడాది రూ.2 కోట్లతో జట్టు అట్టి పెట్టుకుంది. గతేడాది (2024) జట్టు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆమె (972)...లీగ్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. అయితే, తాజా ఎడిషన్‌కు ఆమె దూరం కావడంతో.. భారత యువ క్రీడాకారిణి సయాలీ సత్‌గరేను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది.

ఇక గతంలో గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున రెండు సీజన్లలో కలిపి 4 మ్యాచ్‌లు ఆడిన సయాలీ.. 20 పరుగులు చేయగలిగింది. తాజాగా పెర్రీ స్థానంలో.. కనీస ధర రూ.30 లక్షలకు సయాలీని ఈసారి ఆర్సీబీ ఎంచుకుంది. 

సదర్లాండ్‌ కూడా
మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్, ఆస్ట్రేలియాకే చెందిన అనాబెల్‌ సదర్లాండ్‌ కూడా వ్యక్తిగత కారణాలతోనే లీగ్‌కు దూరమైంది. ఒక ఏడాది గుజరాత్‌ జట్టు తరఫున ఆడిన సదర్లాండ్‌ గత రెండు సీజన్లుగా ఢిల్లీతోనే ఉంది.

ఈ ఏడాది రూ.2.20 కోట్లకు ఆమెను ఢిల్లీ కొనసాగించింది. సదర్లాండ్‌ స్థానంలో ఆసీస్‌ లెగ్‌స్పిన్నర్‌ అలానా కింగ్‌ను క్యాపిటల్స్‌ తీసుకుంది. కింగ్‌ గత ఏడాది యూపీ వారియర్స్‌ తరఫున ఒకే ఒక డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆ ప్లేయర్‌కు ఎవరూ సాటిరారు!
‘‘ఈసారి ఎలిస్‌ పెర్రీ రావడం లేదు. అనాబెల్‌ సదర్లాండ్‌ కూడా ఈ సీజన్‌ ఆడటం లేదు. దీంతో ఆర్సీబీ, ఢిల్లీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ ఈసారి ఫేవరెట్‌గా ఉంది.

కానీ ఎలిస్‌ పెర్రీ లేకపోవడం వారి గెలుపు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. పెర్రీ స్థానంలో ఆర్సీబీ సయాలీ సత్‌గరేను తీసుకువచ్చింది. వీరి స్కిల్‌ సెట్‌ ఒకటే కావొచ్చు.. కానీ సయాలీ.. పెర్రీ స్థానాన్ని భర్తీ చేయలేదు. నైపుణ్యాల పరంగా ఎలిస్‌ పెర్రీకి సయాలీ దరిదాపుల్లోకి కూడా రాలేదు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

అదే విధంగా.. అనాబెల్‌ స్థానంలో అలనా సరైన ప్లేయర్‌ కాదని ఈ మాజీ క్రికెటర్‌ అభిప్రాయపడ్డాడు. అనాబెల్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగలదన్న ఆకాశ్‌ చోప్రా.. అలనా మంచి స్పిన్నర్‌ మాత్రమే అని.. బ్యాటింగ్‌ పరంగా ఆమె పెద్దగా ఆకట్టుకోలేదని పేర్కొన్నాడు.

తారా నోరిస్‌ దూరం
ఇదిలా ఉంటే.. యూపీ వారియర్స్‌ జట్టు సభ్యురాలు తారా నోరిస్‌ కూడా లీగ్‌కు దూరమైంది. టీ20 వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో తన జట్టు అమెరికా తరఫున బరిలోకి దిగేందుకు నోరిస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. నోరిస్‌ స్థానంలో  ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ చార్లీ నాట్‌ను వారియర్స్‌ జట్టులోకి ఎంచుకుంది. నాట్‌ గతంలో ఎప్పుడూ డబ్ల్యూపీఎల్‌ ఆడలేదు. 

చదవండి: బీసీసీఐ యూటర్న్‌!.. షమీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement