డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్‌లో ఆర్సీబీ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇవాళ (జనవరి 29) జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో కలిసికట్టుగా రాణించి, ప్రత్యర్ధిని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. వడోదర వేదికగా యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. యూపీని 143 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.
ఓపెనర్లు మెగ్ లాన్నింగ్ (41), దీప్తి శర్మ (55) తొలి వికెట్‌కు 49 బంతుల్లో 74 పరుగులు జోడించి శుభారంభం అందించినా.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోయారు. స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి వారియర్జ్‌ను కుదురుకోన్విలేదు. పేసర్ లారెన్ బెల్ (4-0-21-1) మరోసారి తన అద్భుత ప్రదర్శనను కొనసాగించగా.. నదినే డి క్లెర్క్ (4-0-22-4) వారియర్జ్ వెన్ను విరిచింది.
ఆఫ్ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (4-0-27-1), గ్రేస్ హ్యారిస్ (3-0-22-2) కూడా అద్భుతంగా రాణించారు. రాధా యాదవ్ (2-0-11-0) వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసింది. సయాలీ సత్ఘరే (2-0-21-0), అరుంధతి రెడ్డి (1-0-14-0) ఓ మోస్తరుగా పరుగులు సమర్పించుకున్నారు.
వారియర్జ్ ఇన్నింగ్స్‌లో లాన్నింగ్, దీప్తి శర్మ మినహా ఎవ్వరూ రాణించలేదు. హర్లీన్ డియోల్ (14), సిమ్రన్ షేక్ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. యామీ జోన్స్ (1), క్లో ట్రయెన్ (6), శ్వేతా సెహ్రావత్ (7), సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ డకౌటైంది. ఆఖరి ఓవర్‌లో క్లెర్క్ 2 వికెట్లు తీసి వారియర్జ్‌ను కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోనివ్వలేదు.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే, నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ఏకైక జట్టుగా చలామణి అవుతంది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు చివరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి వచ్చింది.


