పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ | Sridhar Babu likely to visit Germany in Jan | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ

Nov 28 2025 3:51 AM | Updated on Nov 28 2025 3:51 AM

Sridhar Babu likely to visit Germany in Jan

సచివాలయంలో జర్మన్‌ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువత, నైపుణ్యాలకు కొదవలేదు: మంత్రి శ్రీధర్‌బాబు

జర్మన్‌ ప్రతినిధులతో భేటీ  

సాక్షి హైదరాబాద్‌: విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థా నం అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఐటీ, ఏరోస్పేస్, మాను్యఫాక్చరింగ్, ఫార్మారంగాలకు ఒక మంచి ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో తనను కలిసిన జర్మన్‌ ఫ్రీడరిక్‌– ఎబర్ట్‌– స్టిఫ్టంగ్‌ (ఎఫ్‌ఈఎస్‌) ఫౌండేషన్‌ ప్రతినిధులు డా.సబీన్‌ ఫాండ్రిక్, మిర్కో గుంథర్, క్రిస్టోఫ్‌ మోహ్రా తదితరులకు రాష్ట్రం అమలు చేస్తున్న సులభతర పారిశ్రామిక విధానాలను, సంక్షేమ పథకాలను వివరించా రు. అత్యంత ప్రతిభావంతులైన యువత రాష్ట్రంలో ఉన్నందున నైపుణ్యాలకు కొదవలేదని తెలిపారు.

జర్మనీ–తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్నివిధాలా సహకరిస్తామని శ్రీధర్‌బాబు చెప్పారు. స్కిల్‌ వర్సిటీని పరిశ్రమల భాగస్వామ్యంతో ఏర్పాటు చేశామని, పరిశ్రమలకు అవసరమైన శిక్షణను ఈ యూనివర్సిటీ ద్వారా ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పరిశోధన, వినూత్న ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈ కోసం నూతన విధానాన్ని రూపొందించామని, ఈ రంగంలో ఆటోమేషన్‌ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు మంత్రి వారికి వివరించారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

జర్మనీకి రావాలని ఆహ్వానించిన ప్రతినిధులు.. 
జర్మనీలో పర్యటించాలంటూ మంత్రి శ్రీధర్‌బాబుకు ఆహ్వా నం అందింది. టెక్నాలజీ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌లో ‘తెలంగాణ–జర్మనీ’మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యేలా తమ దేశంలో పర్యటించాలని జర్మన్‌ బుండెస్‌‎టాగ్‌ సభ్యుడు, ఏఎఫ్‌డీ పార్లమెంటరీ గ్రూప్‌ ఫారిన్‌ పాలసీ అధికార ప్రతినిధి, ఇండో–జర్మన్‌ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌ గ్రూప్‌ చైర్మన్‌ మార్కస్‌ ఫ్రోహ్న్‌మైయర్‌ ఆయనను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి శ్రీధర్‌బాబు జనవరిలో జర్మనీలో పర్యటించనున్నారు.  కాగా, జర్మన్‌ ప్రతినిధుల బృందం గురువారం సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసింది. ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై కూడా తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement