మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ ఎలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది ఆయుధాలతో పాటు మహారాష్ట్రకు చెందిన గోండియా జిల్లాలోని దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలోకి వారందరూ కలిసిపోయారు. జనవరి 1వ తేదీన సాయుధ విరమణ చేస్తున్నట్టు అనంత్ నిన్ననే లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ గడువులోపే పోలీసుల ఎదుట అనంత్ లొంగిపోయారు. అనంత్‌పై రూ.కోటి రివార్డు ఉంది.
జనవరి 1న పోలీసులు ఎదుట లొంగిపోతామని లేఖ విడుదలైన 24 గంటలు కాకముందే 15 మందితో కలిసి ఆయన లొంగిపోవడం విశేషం. లొంగిపోయిన వారిలో జోన్ ఇంఛార్జితో పాటు విస్తార్ మూడో ప్లటూన్ కమాండర్ సురేంద్ర కూడా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్ వల్ల పార్టీ బలహీనమైందని.. దీంతో మిగతావారందరూ కూడా లొంగిపోవాలని కేంద్రం చేసిన విజ్ఞప్తితో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనంత్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.


