ముంబై: ఆయుధ విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో, సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
వివరాల ప్రకారం.. ఆయుధాలు వీడే విషయమై మావోయిస్టులు తాజాగా లేఖ విడుదలు చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపించారు. మావోయిస్టు ప్రతినిధి పేరుతో సీఎంలకు లేఖ అందింది. ఈ లేఖలో మావోయిస్టులు తాము ఆయుధాలు వీడి, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా, కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న ‘పోరాటం నిలిపివేయాలన్న’ నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మావోయిస్టు ప్రతినిధులు ఆయుధాలు విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాస పథకాలను పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం
ఈ లేఖలో మావోయిస్టులు.. ఎంఎంసీ జోన్‌లోని మావోయిస్టులందరూ సామూహికంగా లొంగిపోతారు. ఎప్పటి నుంచి ఆపరేషన్ కూంబింగ్‌ను నిలిపివేస్తారో.. అప్పుడే మేము ఆయుధాలను వీడటం జరుగుతుంది. ఆ వెంటనే ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. అలాగే, మావోయిస్టులు తమ ఈ కీలక నిర్ణయంపై సమష్టి నిర్ణయానికి రావడానికి కొంత సమయాన్ని కోరారు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయడానికి తమకు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని వారు ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తి వెనుక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదని, కేవలం అంతర్గతంగా చర్చించుకోవడానికి, తుది నిర్ణయాన్ని నిర్ధారించుకోవడానికి మాత్రమే ఈ సమయం అవసరమని వారు లేఖలో స్పష్టం చేశారు.

ఆపరేషన్ కగార్..
అయితే, ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల అభ్యర్థనను ప్రభుత్వాలు ఏ విధంగా స్వీకరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల ప్రతిపాదనను స్వాగతిస్తూ ఎలాంటి చర్యలు లేదా హామీలు ఇస్తాయనే చర్చ మొదలైంది. మావోయిస్టులు అడిగిన సమయం లోపల, ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు, భద్రతా బలగాలు కూడా తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికి మావోయిస్టుల ఆయుధ విరమణ లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక మలుపుగా పరిగణించవచ్చు.


