ముంబై: మహరాష్ట్రలో ఇటీవల మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం బద్ధ శత్రువులైన కాంగ్రెస్-బీజేపీ పార్టీలు జతకట్టాయి. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అయితే తాజాగా ఆ పొత్తుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇటువంటి పొత్తులను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు.
మహారాష్ట్రలోని కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అంబర్‌పేట్ మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు దీనిలో షిండే నేతృత్వంలోనే శివసేనకు 27 స్థానాలు రాగా, బీజేపీ14, కాంగ్రెస్ 12, ఎన్సీపీకి నాలుగు స్థానాలు వచ్చాయి. దీంతో మున్సిపల్ పీఠం కోసం బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీలు జతకట్టాయి. దీంతో ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్, బీజేపీలు జతకట్టడం దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి.
అంతేకాకుండా అకోలా జిల్లాలోని అకోట్ మున్సిపల్ స్థానం కోసం సైతం బీజేపీ పార్టీ తన బద్దశత్రువైన ఏంఐఏంతో పొత్తుపెట్టుకుంది. ఈ నేపథ్యంలో అనైతిక కలయికపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ "కాంగ్రెస్, ఎంఐఏం పార్టీలతో పొత్తును ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఎవరైనా గ్రామ స్థాయి నాయకులు ఇలా పొత్తు పెట్టుకుంటే వారిపై చర్యలు తీసుకోబడతాయి" అన్నారు. ఇటువంటి పొత్తులను పార్టీ అధిష్ఠానం ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని హెచ్చరించారు.
పొత్తుల వ్యవహారంపై ఇదివరకే నాయకులకు ఆదేశాలు జారీ చేశాం అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ స్పందించారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ పొత్తు కాదని శివసేన( శిండే) అవినీతిని పారద్రోలడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ పొత్తుగా పోల్చడం సరికాదన్నారు.


