రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది. జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 7 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
లొంగిపోయిన వారిలో ఒకరు సీవైపీసిఎం, ఒకరు డీవీసీఎం, ముగ్గురు పీపీసిఎం, ముగ్గురు ఏసియం, అలాగే 18 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. మొత్తం మీద వీరిపై రూ. 64 లక్షల రివార్డ్ ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ.. ‘పూనా మార్గం ప్రచారం ప్రభావంతో మావోయిస్టులు తమ పాత మార్గాన్ని వదిలి, జనజీవన స్రవంతిలోకి వచ్చారు. సమాజంలో శాంతి, అభివృద్ధి కోసం వారు ముందుకు రావడం సంతోషకరం’ అని పేర్కొన్నారు.
పోలీసుల వ్యూహం ఫలించింది
సుక్మా జిల్లాలో గత కొంతకాలంగా పోలీసులు సమాజంలో కలిసిపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పూనా మార్గం ప్రచారం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ వ్యూహం ఫలితంగా మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి, శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. వారిని సమాజంలో తిరిగి కలిపి, సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నారు.
సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోవడం, ఛత్తీస్గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పూనా మార్గం ప్రచారం, పోలీసుల వ్యూహం, అభివృద్ధి కార్యక్రమాలు ఈ విజయానికి కారణమయ్యాయి.


