చికిత్స కోసం విజయవాడకు వస్తే పట్టుకున్న ఎస్‌ఐబీ
మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లు కట్టుకథలే..
ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ 23న దేశవ్యాప్త బంద్‌కు పిలుపు
లేఖ విడుదల చేసిన మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన జీవిత సహచరి రాజేను ప్రాణాలతో పట్టుకొని.. చిత్రహింసలు పెట్టి చంపేశాక ఎన్‌కౌంటర్ పేరిట కట్టుకథలు చెబుతున్నారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు 20వ తేదీన రాసిన లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అందులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.
విజయవాడలో అదుపులోకి..: ‘హిడ్మా, ఆయన జీవిత సహచరి రాజే.. కొందరితో చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు ద్రోహులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేంద్ర హోం శాఖ సూచనలతో ఆంధ్ర ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) బలగాలు వీరిని ఈ నెల 15వ తేదీన అదుపులోకి తీసుకున్నాయి. ఆపై లొంగదీసుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో క్రూరంగా హత్య చేశారు. ఆ తర్వాత మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిందని ప్రకటించడమంతా అబద్ధమే.
ఆంధ్ర–ఒడిశా బోర్డర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్, మరికొందరిని పట్టుకొని కాల్చి చంపేసి రంపచోడవరం ఎన్‌కౌంటర్ పేరిట కట్టుకథ అల్లారు. ఉద్యమ స్ఫూర్తి చూపిస్తూ తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించిన హిడ్మాకు మావోయిస్టు పార్టీ శిరస్సు వంచి శ్రద్ధాంజలి అరి్పస్తోంది. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు లొంగకుండా ప్రాణాలర్పించిన శంకర్, రాజే, చైతు, కమ్లూ, ముల్లాల్, దేవేలకు జోహార్లు అరి్పస్తున్నాం’అని అభయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
హిడ్మా వల్లే జనతన సర్కార్: ఉద్యమ అవసరాల కోసం మార్క్సిజాన్ని హిడ్మా విశేషంగా అధ్యయనం చేశాడని, వివిధ సందర్భాల్లో ఎన్నో సర్క్యులర్లు, బుక్ లెట్లను రాసి కేడర్ల అభివృద్ధికి కృషి చేశాడని అభయ్ తెలిపారు. మిలిటరీ రంగంలో విశేష అధ్యయనం చేసి మెరుగైన ఫలితాలను హిడ్మా సాధించాడన్నారు. ఆయన వల్లే వందలాది ఆయుధాలు పీఎల్‌జీఏ పరం అయ్యాయని తెలిపారు. శత్రు అధికారాన్ని ధ్వంసం చేయడంలో హిడ్మా పైచేయి సాధించాడని, దీని ఫలితంగానే దక్షిణ సబ్‌జోన్‌లో జనతన సర్కార్ నిర్మాణం జరిగిందని వెల్లడించారు.
పాలకవర్గాల విషప్రచారం: హిడ్మాను ఒక దుర్మార్గుడిగా పాలకవర్గ మీడి యా ఎంతో కాలంగా చిత్రీకరిస్తున్నారని అభయ్ విమర్శించారు. హిడ్మాను హత్య చేశాక ఈ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారన్నారు. ఎంతగా విష ప్రచారాలు చేసినా ప్రజల హృదయాలలో హిడ్మా స్థానం చెరిగిపోదన్నారు. భగత్‌సింగ్, కొమురంభీం, గుండాదూర్, గేంద్‌సింగ్, అల్లూరి సీతారామరాజులాగే హిడ్మా చరిత్రలో నిలిచిపోతాడన్నారు.


