కేసీఆర్ స్థాయికి రేవంత్‌రెడ్డి సరిపోడు
రాహుల్ లీడర్ కాదు.. స్క్రిప్టు చదివే రీడర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
జనగామ: ‘వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రైతుబంధును రూ.15 వేలకు పెంచుతానన్నారు. కౌలుదారులకు కూడా ఇస్తానన్నారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తానన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఇవన్నీ అబద్ధాలు. అలాంటి హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్‌గాందీనే నడిబజారులో ఉరితీయాలి..’అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కె.తారక రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ లీడర్ కాదని, దేశంలో ఏకైక స్క్రిప్టు చదివే రీడర్ అని విమర్శించారు. స్క్రిప్టులో ఏమున్నా చదివేసే అవగాహన లేని నేత అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? తెలియని పరిస్థితి ఉందన్నారు. సీఎంకు కూడా మూటలు మోసిన అనుభవం తప్ప మరేమీ లేదని, ఏమీ తెలియదని వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లాలో గెలుపొందిన బీఆర్‌ఎస్ సర్పంచుల అభినందన సభలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రేవంత్‌కు పిచ్చి ముదిరి పాకానపడింది
‘రాష్ట్రంలో చెక్‌డ్యాంలు పటాకులు పేలినట్లు పేలుతున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా అట్లనే ఉంది. రాష్ట్రంలో పాలిచ్చే బర్రెను కాదనుకుని, వెనకనుంచి తన్నే గేదెను తెచ్చుకున్నామని ప్రజలు మథనపడుతున్నారు. గోదావరి ఎక్కడుందో కూడా రేవంత్‌కు తెలియదు. భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెబుతున్న రేవంత్‌రెడ్డి..రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతోంది.. ప్రజలకు చేసిన వాగ్దానాలు ఎంతవరకూ నెరవేర్చారో ఒక్కసారి ఆలోచించాలి. ఎనకటి రోజులు తెస్తానన్న రేవంత్, రాబందు కాలం తీసుకువచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకుడిని (కేసీఆర్)ఉరి తీయాలంటారా?.
ఇంటింటికీ నీళ్లు ఇచ్చి, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌ను ఉరి వేయాలని రేవంత్‌రెడ్డి అనడం చూస్తుంటే ఆయనకు పిచ్చి ముదిరి పాకాన పడిందని అర్థమవుతోంది. ఆ మాటకొస్తే హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్‌గాం«దీనే ఉరి తీయాలి. తన సొంత సెక్యూరిటీని కూడా ప్రజల ముందే కొట్టే ముఖ్యమంత్రి ఎక్కడా దొరకడు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ చెప్పు దూళికీ రేవంత్ సరిపోడు. కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కే ఆయన ఆగమాగం అవుతున్నాడు. ఇక అసెంబ్లీలో మాట్లాడితే అక్కడే గుండె ఆగిపోయి సచ్చిపోతారు..’అని కేటీఆర్ విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


