సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి

Mar 7 2026 8:18 AM | Updated on Mar 7 2026 8:18 AM

సాక్షి, మహబూబాబాద్‌: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్‌ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు.

డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలి..

రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్‌ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్‌ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి..

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికా రులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకుంనేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. ఎంపీ బలరాంనాయక్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విప్‌ రాచంద్రునాయక్‌ మాట్లాడుతూ.. గత కలెక్టర్‌ హయాంలో ఫైల్స్‌ పెండింగ్‌లో ఉండడంతో మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్‌, నాగరాజు, ప్రకాశ్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కా కుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకా లు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ములుగు డీఎఫ్‌ఓకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్‌ చైర్మన్లు పాల్గొన్నారు.

వార్డు సభ్యుల నుంచి చైర్మన్లు,

సర్పంచ్‌ల వరకు శిక్షణ ఇవ్వండి

బస్సుల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే

పాఠశాలకు గుర్తింపు

ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ

ఇల్లుకు బిల్లు అందాలి

ఫారెస్ట్‌, రెవెన్యూ మధ్య ఉన్న

భూ సమస్యలు పరిష్కరించాలి

ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement