జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌కు చింతపండు భారీగా వస్తోంది. వారం రోజుల క్రితమే చింతపండు రాక ప్రారంభమై, శుక్రవారం భారీగా మార్కెట్‌కు చేరింది. ఈ సీజన్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల చింతపండు దిగుబడి 30 నుంచి 40 శాతం వరకు తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ఆశించినంత దిగుబడి రాకపోయినా, వచ్చిన పంటను విక్రయించేందుకు రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం జనగామ మార్కెట్‌తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రధాన మార్కెట్‌లో కూడా చింతపండు భారీగా చేరుతోంది. అయితే ధర విష యంలో జనగామ మార్కెట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇక్కడి మార్కెట్‌లో ప్రస్తుతం మధ్యరకం చింతపండు క్వింటాల్‌కు రూ.8,500 వరకు ధర ఉండగా, మోడల్ ధర రూ.9,700గా నమోదైంది. అత్యధికంగా రూ.10,000 వరకు ధర పలికింది.
రికార్డు స్థాయిలో
జనగామ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో క్వింటాల్ చింతపండు రూ.11,290 వరకు ధర పలకడం రైతులకు ఆనందాన్ని కలిగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనగామ మార్కెట్‌పై వ్యాపారులు, రైతుల దృష్టి మరింతగా పడింది. భువనగిరి మార్కెట్‌తో పోలిస్తే క్వింటాల్‌కు సుమారు రూ.1,000పైగా ధర రావడం గమనార్హం. శుక్రవారం మార్కెట్ జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన 17 మంది రైతులు 14.70 క్వింటాళ్లు(49 అంకాలు) తీసుకొచ్చారు. క్వింటాల్ చింతపండుకు రికార్డుగా రూ.11, 290కి ఖరీదుదారుడు శర్విరాల ఉపేందర్ కొనుగోలు చేయగా, మోడల్ ప్రైజ్ రూ.9,700లు వచ్చింది. దీనికి మార్కెట్ అధికారుల పర్యవేక్షణ ప్రధాన కారణమని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో జనగామ మార్కెట్‌కు చిం తపండు రాక మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే రాక పెరిగే సమయంలో ధరలు పడిపోకుండా మార్కెట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో
రికార్డుస్థాయిలో ధర
క్వింటాల్‌కు రూ.11,290లు
పలికిన చింతపండు
అత్యధిక ధరలతో రైతుల ఆనందం


