సాక్షి, నిజామాబాద్: భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్‌పై రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా.. బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోటం ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ చేశారు.
ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డెత్ గుండె పోటు అంటూ చిత్రీకరించారు. నిద్ర మాత్రలు ఇచ్చి భర్తగొంతు నులిమి హత్య చేసి హార్ట్ ఎటాక్‌గా భార్య నమ్మించింది. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తామే హత్య చేసినట్లు భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ ఒప్పుకున్నారు.
పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామానికి చెందిన పట్టాటి రమేష్ భార్య సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్‌తో ఆమెకు పరిచయం.. వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో, ఇద్దరినీ గట్టిగా మందలించాడు.

దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని సౌమ్య ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. గత నెల 20న సౌమ్య తన ప్రియుడు దిలీప్‌తో కలిసి రమేష్‌ను ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియల సమయంలో రమేష్ మెడపై గాట్లు కనిపించడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే ఇజ్రాయెల్‌లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో సౌమ్యతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


