హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు(శనివారం, నవంబర్ 22వ తేదీ) 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల వద్ద .303 రైఫిల్, G3రైఫిల్, SLR, AK47 రైఫిల్, బుల్లెట్స్ ,క్యాట్రేజ్ సీజ్ తదితర మారణాయుధాలను పోలీసులకు అందజేశారు. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, నారాయణ, ఎర్రాలు తదితరులు ఉన్నారు. లొంగిపోయిన 37 మందిలో 25 మంది మహిళలు ఉన్నారు.
దీనిలో భాగంగా డీజీపీ మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు, నగదుతో పాటు ప్రోత్సాహక వెసులుబాటు కల్పిస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకే వీరంతా జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు. మావోయిస్టులు జనంలోకి రావాలని, ఎలాంటి సమస్య లేకుండా చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని, దానిలో భాగంగానే మావోయిస్టు లొంగుబాటు చర్యలు జరుగుతున్నాయన్నారు.
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని డీజీపీ తెలిపారు. ఏ రకంగా బయటికి వచ్చిన మావోయిస్టులకు అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. మీడియా ద్వారా వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా వచ్చినా, రాజకీయ నాయకుల ద్వారా వచ్చినా తాము స్వాగతిస్తామన్నారు.

‘తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు గా ఉన్న ఆజాద్ 30 ఏళ్ల గా అజ్ఞాతంలో ఉన్నాడు ములుగు జిల్లాకు చెందిన ఆజాద్ మీద 20 లక్షల రివార్డ్ ఉంది . అప్పాసి నారాయణ మీద 20 లక్షలు రివార్డ్ ఉంది. మిగతా వారికి 25 వేల రూపాయల నగదు ఇస్తున్నాం. 1.41 కోటి రూపాయల. రివార్డ్ ను 37 మంది కి రివార్డ్‌గా ఇస్తున్నాం. 11 నెలలో 465 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయారు. 59 మంది తెలంగాణ కు చెందిన మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం 9 మంది కేంద్ర కమిటీలో ఉన్నారు. కేంద్ర కమిటీలో ఐదుగురు తెలంగాణ వారు ఉన్నారు. 10 మంది స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారు’ అని డీజీపీ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రం చెప్పినట్లుగానే.. ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. ఆపరేషన్ కగార్ దెబ్బతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గత కొంతకాలంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో అడవుల్ని వీడి.. జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అదే సమయంలో ఈ ఏడాదిలో.. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా వరుస ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందారు. ఇక.. అనారోగ్య కారణాలతో చంద్రన్న, బండి ప్రకాశ్ ఆయుధాలు వీడారు. కొన్ని రోజుల క్రితం మావోయిస్టు మాస్టర్ మైండ్ మాడావి హిడ్మా.. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో సహా 37 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఆ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయ్యింది.

మేం పార్టీకి చెప్పే లొంగిపోయాం: ఆజాద్
తాము పార్టీకి చెప్పే లొంగిపోయామని కీలక నేత ఆజాద్ స్పష్టం చేశారు. స్టేట్ కమిటీలో ఇంకా కీలక నేతలున్నారని, వారంతా లొంగిపోవాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తోందన్నారు. మావోయిస్టు స్టేట్ కమిటీలో ఉన్న ఇద్దరు కీలక నేతలు కూడా లొంగిపోతేనే మంచిదని ఆజాద్ పేర్కొన్నారు.
ఉద్యమాన్ని నడిపించడం కష్టం: ఎర్రా
మారుతున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడిపించడం కష్టమని మావోయిస్టు నేత ఎర్రా పేర్కొన్నారు. వరుసగా మావోయిస్టులు చనిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టమన్నారు.



