నిజామాబాద్: జిల్లాలో ఇటీవల ఓ డెంటల్ డాక్టర్‌పై మహిళ ఫిర్యాదు చేయడం పెనుదుమారం రేపింది. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, వాట్సాప్‌లో వీడియో, ఆడియో కాల్స్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సదరు కేసులో నిందితుల వేధింపులకు సంబంధించిన సాక్ష్యాలను సైతం చూపించగా, పోలీసులు నిర్భయ కింద కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. అయితే, పలుకుబడి ఉన్న ఓ సంఘం నేత మధ్యవర్తిత్వంతో రూ. లక్షలు చేతులు మారడంతో నామమాత్రపు కేసులతో మమ అనిపించారనే చర్చ జరుగుతోంది. బాధితురాలు నేరుగా నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను డెంటల్ డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్ అనే వ్యక్తులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే నాన్‌బెయిల్‌బుల్ కేసు పెడతామని చెప్పినట్లు తెలిసింది. అయితే అటు తర్వాత సదరు డెంటల్ వైద్యుడు అమర్ అందుబాటులో లేడని ఇంటికి నోటీసు ఇచ్చి వచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ పేరుతో సాగదీత
డెంటల్ డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్‌పై మహిళ ఫిర్యాదు తర్వాత నెలకొన్న పరిస్థితులు తారుమారు అయ్యాయి. మొదట్లో సీరియస్‌గా స్పందించిన పోలీసులు అటు తర్వాతా నోటీసు, నామామత్రపు కేసు పేరిట సాగదీసేలా వ్యవహారిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఓ సంఘం నేత సదరు వైద్యుడిపై నాన్‌బెయిలబుల్ కేసు కాకుండా చిన్నపాటి కేసు నమోదు చేయించేలా చక్రం తిప్పాడని చర్చ జరుగుతోంది. సుమారు రూ. 30 లక్షలకు డీల్ కుదిరిందని, అందుకే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేసు నమోదైంది..
మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్‌లో డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్‌లపై కేసు నమోదైంది. నేను ఇటీవలే బదిలీపై వచ్చాను. నోటీసులు కూడా ఇచ్చారు. గతంలో ఉన్న సీఐ వద్ద పూర్తి సమాచారం ఉంది.
– సతీశ్, సీఐ, నాలుగో టౌన్
విచారణ జరుగుతోంది..
డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్‌లపై నమోదైన కేసు విచారణ జరుగుతోంది. నాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. స్థానిక ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్ విచారణ చేపడుతున్నారు. విచారణ అనంతరం చర్యలు ఉంటాయి.
– శ్రీనివాస్ రాజ్, సీఐ


