కష్టపడి జీవితంలో పైకి ఎదిగిన మనిషి ఆయన. కానీ, బంగారం మీద మోజు ప్రాణం మీదకు తెచ్చింది. నెట్టింట గోల్డ్‌మ్యాన్‌గా వైరల్ అయిన ఆయనకు ఓ ముఠా నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. రూ.5 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడా వ్యక్తి. దీంతో ఈ బెదిరింపుల వ్యవహారం కలకలం రేపింది.
రాజస్థాన్ చిత్తోర్‌గఢ్ వ్యాపారి కన్హయ్యలాల్ ఖటిక్‌కు గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ముఠా నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. కోరినంతా డబ్బు ఇవ్వకుంటే బంగారం వేసుకునేందుకు ఉండవంటూ ఆ గ్యాంగ్ మెంబర్లు ఆయనకు దమ్‌కీ ఇచ్చారు. దీంతో ఆయన కోట్వాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయ్యింది. తొలుత ఓ నెంబర్ నుంచి మిస్డ్‌కాల్ వచ్చిందని, ఆ తర్వాత వాట్సాప్ కాల్ చేసి బెదిరించారని ఆయన చెబుతున్నారు. కాసేపు ఆగి మళ్లీ ఫోన్ చేసి బెదిరించారని పోలీసులకు తెలిపాడాయన.

ఆ వ్యాపారమే మలుపు
50 ఏళ్ల వయసున్న కన్హయ్య మొదట్లో తోపుడు బండి మీద గల్లీలు తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్మేవాడు. తర్వాత కశ్మీరీ ఆపిల్ వ్యాపారం చేసి లాభాలు అర్జించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి(దివంగత) అంటే అతనికి ఎంతో పిచ్చి. ఆయన సంగీతంలో వచ్చిన పాటలు వినడమే కాదు.. ఆయనలా బంగారం వేసుకుని తిరగడమూ అలవాటు చేసుకున్నాడు. అలా.. మెడలో ప్రస్తుతం సుమారు 3.5 కిలోల బంగారం ఒంటిపై ధరిస్తున్నాడు. ఆయనగారి గోల్డ్‌మ్యాన్ వేషాలు వైరల్ కావడంతో ‘గోల్డ్‌మాన్ ఆఫ్ చిత్తోర్‌గఢ్’ అనే పేరు ముద్రపడింది.

మెడలో బంగారంతో చుట్టూ బౌన్సర్లతో బయట తిరుగుతూ హల్ చల్ చేస్తూ.. ఆ ఫొటోలు, వీడియోలను తన టీంతో వైరల్ చేయిస్తుంటాడు కన్హయ్యలాల్. అయితే ఆ షో ఆఫ్ వల్లే ఇప్పుడు బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు
రోహిత్ గోదారా ఎవరు?
బికనీర్‌కు చెందిన రోహిత్ గోదారా.. ఓ గ్యాంగ్‌స్టర్. వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజడంలో పేరుగాంచాడు. దేశంలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో 32 కేసులు ఉన్నాయి. అలాగే.. ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్‌స్టర్ రాజు దేహత్ హత్య కేసులో గోదారానే ప్రధాన నిందితుడు. 2022లో నకిలీ పాస్‌పోర్టు సాయంతో పవన్ కుమార్ అనే పేరు మీద దుబాయ్‌కి పారిపోయాడని అధికారులు చెబుతున్నాడు. ప్రస్తుతం అతను కెనడాలో ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


