45 నిమిషాల్లో ఐదుసార్లు టీచర్ సాయం కోరిన చిన్నారి
జైపూర్ స్కూల్‌లో విద్యార్థిని ఆత్మహత్య ఘటన
దర్యాప్తులో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి..
న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఈ నెల ఒకటో తేదీన ఓ ప్రైవేట్ స్కూల్‌లో 4వ తరగతి చదివే విద్యార్థిని ఆత్మహత్యపై అధికారులు చేపట్టిన దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటన జరిగిన రోజు చివరి 45 నిమిషాల్లో బాధిత బాలిక క్లాస్ టీచర్‌కు కనీసం ఐదు సార్లు తనను బ్యాడ్ వర్డ్స్‌తో క్లాస్‌మేట్స్ వేధిస్తున్నారనే విషయం గురించి ఫిర్యాదు చేసినట్లు సీబీఎస్‌ఈ ఏర్పాటు చేసిన కమిటీ దర్యాప్తులో తేలింది.
ఆమె ఫిర్యాదును విన్న టీచర్ క్లాసంతా వినిపించేలా గద్దించిందే తప్ప, ఎటువంటి చర్య తీసుకోలేదు. యాజమాన్యానికి కూడా టీచర్ ఈ విషయం తెలపలేదు. దీంతో, దిక్కుతోచని స్ఙితిలో చిన్నారి తమ క్లాసు జరిగే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్కూలు భవనంలో నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానిక నీరజా మోదీ స్కూల్‌లో చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీబీఎస్‌ఈ స్కూలు యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది. స్కూలులో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో విఫలైమైందని పేర్కొంది.
తోటి విద్యార్థులు పదేపదే వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని బాధిత చిన్నారి మొదటిసారిగా 2024 జూలైలో తల్లిదండ్రులకు తెలిపింది. వారు టీచర్ల దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు ఏడాదిన్నరగా ఇలా వేధింపులు ఆగకుండా కొనసాగుతుండటం, చిన్నారి స్కూలులో టీచర్లకు చెప్పడం జరుగుతూనే ఉంది. టీచర్లు సర్దుకుపోవాలంటూ బాలికను గద్దించి చెబుతున్నారే తప్ప, బాధ్యులను మందలించిన పాపానపోలేదని దర్యాప్తులో వెల్లడైంది.
సెపె్టంబర్ పేరెంట్స్ మీటింగ్ రోజున కూడా తమ సమక్షంలోనే కుమార్తెను తోటి బాలురు వేధించడం చూసిన తండ్రి, టీచర్లకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతా వేధింపులు ఆగలేదు. ఘటన జరిగిన రోజున బాధిత చిన్నారి స్కూలుకు వచ్చే వరకు హుషారుగానే కనిపించింది. ఉదయం 11 గంటల సమయంలో ఆమె వద్ద ఉన్న డిజిటల్ స్లేట్‌పై ఏదో రాయడం లేదా బొమ్మ వేయడం జరిగిందని, అది చూసిన తర్వాతే ఆమె తీవ్రంగా కలతకు గురైందని దర్యాప్తులో తేలింది. అలాంటివి రాయొద్దని వారికి చెప్పండని టీచర్‌కు ఫిర్యాదు చేసింది. అలా కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే ఐదుసార్లు టీచర్ల వద్దకు వెళ్లి తన ఆవేదన తెలిపింది. తగు రీతిలో స్పందించకపోగా ఆమెపైనే కేకలు వేసింది. దీంతో ఏమీ పాలుపోని పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నాలుగో అంతస్తుకు వెళ్లి కిందికి దూకి, తనువు చాలించిందని సీబీఎస్‌ఈ నివేదిక వెల్లడించింది. అభ్యంతరకరమైన మాటలు, దుర్భాషలతో వేధించడం వల్లే చిన్నారి తట్టుకోలేకపోయిందని నివేదిక గుర్తించింది. ఇదొక్కటే కాదు..
స్కూలు యాజమాన్యం సీబీఎస్‌ఈ పలు నిబంధనలను పాటించడం లేదని గుర్తించి, నోటీసు జారీ చేసింది.


