ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటికే దాదాపు 16 మంది మృతి చెందారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తు వేలాదిమందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
ఇండోనేషియాలో తీవ్రమైన వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన వివరాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ వెల్లడించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం తెల్లవారుజామున నదుల్లో జలపాతం అకస్మాత్తుగా పెరిగింది. ఈ బలమైన నది ప్రవాహాలకు సియావు టాగులాండాంగ్ బియారో జిల్లాలోని గ్రామాల కొట్టుకుపోయాయి. ఈ వరదలు అనేక గ్రామాలను ముంచెత్తాయి.
సులవేసి ద్వీపం నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియావు ద్వీపంలోని నాలుగు ప్రభావిత గ్రామాలకు పోలీసులు, సైన్యం మద్దతుతో రెస్క్యూ బృందాలను మోహరించారు. అయితే దెబ్బతిన్న రోడ్లు, కమ్యూనికేషన్ అంతరాయం వల్ల రెస్క్యూ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ వరదల్లో దాదాపు ఏడు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 140 కి పైగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి మరింత దిగజారడంతో ప్రజలను చర్చిలు, ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయ శిబిరాలకు తరలించారు.


