రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయాలు అనూహ్యంగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ ఇటీవల ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక అగ్రనేతను కలవడం సంచలనంగా మారింది. బిహార్‌లో మహాఘట్‌బంధన్ ఓటమి పాలైన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ కాదని, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం),బీజేపీ మధ్య కొత్త రాజకీయ అవగాహనకు పునాది కావచ్చని మీడియా వర్గాలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో భారీ రాజకీయ మార్పుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
ఇదే జరిగితే..
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 సీట్లు ఉన్నాయి. మెజారిటీకి 41 సీట్లు అవసరం. ప్రస్తుతం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి 56 సీట్ల బలం ఉంది (జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్‌జేడీ 4, సీపీఐ-ఎంఎల్ (ఎల్) 2). అయితే, సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) వైపు మొగ్గు చూపితే, సంఖ్యాబలం తక్షణమే మారిపోతుంది. జేఎంఎంకు చెందిన 34 స్థానాలు ఎన్‌డీఏ (బీజేపీ 21, ఎల్జేపీ 1, ఏజేఎస్‌యూ 1, జేడీయూ 1, ఇతరులు 1) స్థానాలతో కలిస్తే, కూటమి బలం ఏకంగా 58 సీట్లకు చేరుకుంటుంది. ఈ సంఖ్య మెజారిటీ మార్కును సునాయాసంగా దాటి, ప్రభుత్వాన్ని సుస్థిరం చేస్తుంది.
అస్థిర భాగస్వామ్యం..
జేఎంఎం- బీజేపీ మధ్య భాగస్వామ్యానికి చారిత్రక నేపథ్యం ఉంది. అయితే అది అస్థిరంగా ఉంది. 2010, 2014 మధ్య కాలంలో ఈ రెండు పార్టీల మధ్య మద్దతు ఉపసంహరణలు, తరచుగా జరిగిన అధికార మార్పులు రాష్ట్రంలో రాజకీయ అల్లకల్లోలానికి దారితీశాయి. రాజకీయ విశ్లేషకులు దీనిని రాజకీయ ఎత్తుగడగా చూస్తున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో సోరెన్.. బీజేపీ తనపై ఈడీ దర్యాప్తులను ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరిగి బీజేపీతో చేతులు కలపడం జార్ఖండ్ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపు కానుంది.
కాంగ్రెస్, ఆర్‌జేడీలకు ఎదురుదెబ్బ
జేఎంఎం ఎన్‌డీఏలోకి చేరితే అది రాష్ట్రంలో కాంగ్రెస్, ఆర్‌జేడీలకు అతిపెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. కాంగ్రెస్ ప్రస్తుతం జేఎంఎం కూటమిలో 16 స్థానాలతో కీలక పాత్ర పోషిస్తోంది. సోరెన్ కూటమిని వీడితే, అధికారికంగా జార్ఖండ్‌లో మహాఘట్‌బంధన్ ప్రభుత్వం పతనమవుతుంది. ఇది జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ వ్యవహారం కేవలం ఊహాగానాల చుట్టే తిరుగుతోంది. దీరిపై ముఖ్యమంత్రి లేదా జేఎంఎం నుండి బహిరంగ ప్రకటన వెలువడలేదు. ఈ ప్రచారం మధ్య, జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. గవర్నర్ పర్యటన ముఖ్యమంత్రి భేటీ తర్వాత జరగడం యాదృచ్ఛికం కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం
హేమంత్ సోరెన్ బీజేపీతో చేతులు కలపాలని నిర్ణయించుకుంటే, జార్ఖండ్ రాజకీయాల్లో తక్షణమే పెను మార్పులు సంభవించనున్నాయి. పాలక కూటమి కూలిపోయి, రాష్ట్రంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ పరిణామం జార్ఖండ్ అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఏదిఏమైనా సోరెన్ తీసుకునే నిర్ణయం జార్ఖండ్ రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాదు, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సమీకరణాలను కూడా ప్రభావితం చేయనుంది.
ఇది కూడా చదవండి: ఊపిరి కోసం యుద్ధం.. రెండు లక్షల మందికి అస్వస్థత!


