పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. అయితే, రిగ్గింగ్‌కు సంబంధించిన ఆధారాలు లేవని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
బిహార్ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ మౌనం వీడారు. తాజాగా ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఓటమి చాలా బాధిస్తోంది. ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు నాకు సరిపోలడం లేదు. ప్రాథమికంగా, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది. రిగ్గింగ్ జరిగినట్టు అర్థమవుతోంది. అయితే, దానికి సంబంధించిన ఆధారాలు ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఓడిపోయిన తర్వాత అందరూ ఇలాగే మాట్లాడతారు అని అనుకోవచ్చు. ఎప్పటికైనా ఆధారాలు బయటకు వస్తాయి. జన్ సురాజ్ యాత్రలో మా టీమ్ సేకరించిన అభిప్రాయంతో ఓటింగ్ సరిపోలడం లేదు. ఏదో తప్పు జరిగిందని నాకు తెలుస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి బిహార్‌లోని వేలాది మంది మహిళా ఓటర్లకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బిహార్‌లో 50వేల మంది మహిళలకు 10వేలు ఇవ్వడం కూడా ఫలితాలపై ప్రభావం చూపించిందన్నారు. అలాగే, ఎన్నికల ప్రచారం చివరి నాటికి మా పార్టీ గెలిచే స్థితిలో లేదనే కారణంగా కొందరు ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో లాలూ జంగిల్ రాజ్ సర్కార్ రావద్దనే కారణంతో ఎన్డీయేకు మద్దతు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
ఇక, బిహార్ ఎన్నికల్లో 243 సీట్లలో 238 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ.. పెద్దగా విజయం సాధించలేదు. ఒక్క నియోజకవర్గాన్ని కూడా గెలుచుకోలేదు. కేవలం 2 నుండి 3 శాతం ఓట్లను మాత్రమే గెలుచుకుంది. ఆయన పార్టీ అభ్యర్థులలో ఎక్కువ మంది డిపాజిట్లు కూడా కోల్పోయారు.
#Exclusive | Jan Suraaj Party chief @PrashantKishor hints at EVM manipulation, says "...wo dikh raha hai kuch toh hua hai. Kya hua hain wo hume pata nahi hai, lekin ye add nahi ho raha." #PrashantKishor #BiharElections2025 @PreetiChoudhry pic.twitter.com/656AuWTGTx
— IndiaToday (@IndiaToday) November 23, 2025


