కేబినెట్ బెర్తుల కోసం జోరందుకున్న పైరవీలు
పట్నా: బిహార్ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతంచేసుకున్న ఎన్‌డీఏ కూటమి పార్టీలు సీఎం నితీశ్‌కుమార్‌ను బుధవారం తమ ఎన్‌డీఏ పక్షనేతగా ఎన్నుకోను న్నాయి. నవంబర్ 20న పదోసారి సీఎంగా నితీశ్ ప్రమాణం చేయబోతుండటంతో ఒకరోజు ముందే ఆయన అధికార పక్షనేతగా ఎంపిక ఖరారైంది. బుధవారం ఉదయం 11 గంటలకు పట్నాలో జేడీ(యూ) శాసనసభాపక్ష పార్టీ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో నితీశ్‌ను తమ పక్షనేతగా ఎన్నికోనున్నారు. ఆ తర్వాత ఎన్‌డీఏ పక్షనేత హోదాలో మధ్యాహ్నం 3.30గంటలకు బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహహ్మద్ ఖాన్‌ను కలిసి నితీశ్ తన రాజీనామా లేఖను అందజేయనున్నారు.
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని తెలియజేస్తూ సంబంధిత లేఖను గవర్నర్‌కు నితీశ్ అందజేయనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి బుధవారంతో ముగియనుంది. పట్నాలో చారిత్రక గాంధీ మైదాన్‌లో 20న జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో నితీశ్‌తోపాటు తామూ ప్రమాణంచేస్తామంటూ మంత్రుల బెర్తుల కోసం పైరవీలు హఠాత్తుగా ఊపందుకున్నాయి. కూటమి పార్టీల మధ్య దీనిపై మల్లగుల్లాలు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 14 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీ స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ముఖ్య నేతలు ఆశిస్తున్నారు.
అయితే తమ నేతకే స్పీకర్ పదవి దక్కాలని బీజేపీ, జేడీ(యూ) రాష్ట్రనేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. జేడీ(యూ) తరఫున విజయ్ చౌదరి, బీజేపీ తరఫున ప్రేమ్ కుమార్ స్పీకర్ పీఠంపై కన్నేశారు. బీజేపీ, జేడీయూల నుంచి తలో ఐదారుగురు కొత్త వాళ్లకు కేబినెట్‌లో స్థానం కల్పించాలని ఎన్‌డీఏ కూటమి భావిస్తోంది. మాహ్నర్ నుంచి గెలిచిన జేడీయూ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు ఉమేశ్ కుష్వాహాను కేబినెట్‌లోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రులందరికీ అవకాశం ఇవ్వాలని జేడీయూ భావిస్తుండగా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని బీజేపీ వాదిస్తోంది. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్‌జేపీ(ఆర్‌వీ) నుంచి ముగ్గురికి, జితన్ రాం మాంఝీ సారథ్యంలోని హెచ్‌ఏఎం నుంచి ఒకరికి అవకాశం దక్కవచ్చు.
ఆర్‌ఎల్‌ఎం పార్టీ నేతలకూ మంత్రి పదవి వరించే వీలుంది. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, పలువురు మంత్రులు, ప్రధాన కార్యదర్శి ప్రత్యాయ అమృత్ కుమార్ గాంధీ మైదాన్‌లో మంగళవారం ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పా ట్లను దగ్గరుండి సమీక్షించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన నున్నారు. వీవీఐపీల తాకిడి ఎక్కువ ఉండటంతో గాంధీమైదాన్ చుట్టూతా భద్రతను కట్టుదిట్టం చేశారు.


