సోమనాథ్ స్వాభిమాన్ పర్వ ఉత్సవాల్లో పాల్గొంటా
ఈ క్షేత్రం మన అజేయ సంకల్పానికి నిదర్శనం
1951లో ప్రధాని నెహ్రూ పునర్నిర్మాణ వేడుకలకు వెళ్లలేదంటూ నింద
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. సోమనాథ్ ఆలయంపై విదేశీయులు మొదటిసారిగా దాడి జరిపి, ధ్వంసం చేసిన దురాగతానికి వెయ్యేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో ఏడాదంతా వివిధ కార్యక్రమాలను తలపెట్టారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి.
సోమనాథ్‌ను 11వ తేదీన సందర్శించుకోనున్నట్లు ప్రధాని సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం భారతీయ నాగరికత అజేయ సంకల్పానికి, బలానికి గొప్ప నిదర్శనం. విదేశీ దురాక్రమణదారులు ఎన్నిసార్లు దాడి చేసినా, ప్రతిసారీ ఈ పుణ్యక్షేత్రం మరింత వైభవోపేతంగా తిరిగి పుంజుకుంది’అని పేర్కొన్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతం వెరావల్‌లో అరేబియా సముద్ర తీరాన ఉన్న సోమనాథ్ ఆలయంలో శివుడు కొలువుతీరాడు.
ఈ ఆలయంపై మొదటిసారిగా తుర్కియే పాలకుడు గజనీ మహ్మద్ దాడి చేసి, విధ్వంసం సృష్టించాడు. అప్పట్నుంచి పలువురు విదేశీ పాలకులు దాడి చేసి దోచుకున్నారు. ‘సోమనాథ్ కథ కేవలం ఒక ఆలయానికి సంబంధించింది కాదు, అది మన సంస్కృతిని, నాగరికతను కాపాడిన భారతమాత కోట్లాది సంతానానికి చెందిన అజేయమైన సాహసగాథ.
శతాబ్దాల తరబడి దాడులు, వలసవాద దోపిడీలను తట్టుకుని నిలబడిన ఈ స్ఫూర్తే నేడు మన దేశాన్ని ప్రపంచ ఆర్థిక వృద్ధిలో అత్యంత వేగంగా ముందుకు సాగుతున్న దేశంగా నిలబెట్టింది’అని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఆలయాన్ని పునర్నిర్మించే విషయంలో సర్దార్ పటేల్ ఎంతో చొరవ కనబరిచారన్న ప్రధాని మోదీ...1951లో జరిగిన ఆలయ ఉత్సవాలకు అప్పటి ప్రధాని నెహ్రూ వెళ్లలేదంటూ నిందించారు. ‘1947లో దీపావళి వేడుకల వేళ సర్దార్ పటేల్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అప్పుడే ఆయన ఆలయానికి పూర్వవైభవం తేవాలని నిర్ణయించుకున్నారు’’ అని మోదీ చెప్పారు.


