చంపా... చరిత్ర సృష్టించింది | Champa Raspeda Set To Become First Doctor From Odisha Didayi Tribe | Sakshi
Sakshi News home page

చంపా... చరిత్ర సృష్టించింది

Aug 22 2025 4:35 AM | Updated on Aug 22 2025 4:35 AM

Champa Raspeda Set To Become First Doctor From Odisha Didayi Tribe

ఫస్ట్‌ టైమ్‌

అడుగడుగునా ఆర్థిక కష్టాలు. ‘అమ్మాయికి ఈ మాత్రం చదువు చాలు’ అనే ఇరుగు పొరుగు వెటకారాలు. అయినా సరే, చదువు విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

 ‘పదవ తరగతి అయినా పూర్తి చేయగలనా’ అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. దిదై అనేది ఒడిశాలోని ఒక గిరిజన తెగ. ఈ తెగ నుంచి జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన తొలి విద్యార్థిగా చంపా రాస్పెడా చరిత్ర సృష్టించింది.

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని అమ్లిబెడ గ్రామానికి చెందిన చంపా రాస్పెడా తల్లి గృహిణి. తండ్రి ఓ పేద రైతు. ఆర్థిక కష్టాల వల్ల ఒకానొక దశలో చంపాకు చదువు కొనసాగించడం కష్టమైంది. అయినా సరే, ఎలాగో ఒకలా ఆర్థిక కష్టాలను అధిగమించి ముందడుగు వేసింది.

చిత్రకొండలో హైస్కూల్‌ చదువు పూర్తయిన తరువాత గోవింద్‌పల్లిలోని ఎస్‌ఎస్‌డీ హైయర్‌ సెకండరీ స్కూల్‌లో ఇంటర్‌ పూర్తి చేసింది. ఆ తరువాత ఆర్థిక కష్టాలతో బీఎస్సీ చదువు మధ్యలోనే ఆగిపోయింది. అయితే హైస్కూల్‌ రోజుల్లో చంపాకు సైన్స్‌ పాఠాలు చెప్పిన టీచర్‌ ధైర్యం చెప్పడమే కాదు బాలసోర్‌లోని నీట్‌ ఉచిత శిక్షణ తరగతులలో చేర్పించారు.

ఆ క్లాస్‌లలో చేరిన క్షణం నుంచే ‘ఎలాగైనా డాక్టర్‌ కావాల్సిందే’ అనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుంది. తన కలను నిజం చేసుకుంది చంపా. బాలసోర్‌లోని ఫకీర్‌ మోహన్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో అడ్మిషన్‌ పొందింది.

మల్కన్‌గిరి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే దిదై తెగ ప్రజలకు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు ప్రధాన జీవనాధారం. చదువు వారికి చాలా దూరంగా ఉండేది. ఇప్పుడిప్పుడే వారు చదువుకు దగ్గరవుతున్నారు. ఈ దశలో చంపా సాధించిన విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

‘వైద్యురాలిగా పేదప్రజలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆర్థిక కష్టాలు అడ్డంకి కాదు... అనే విషయాన్ని విద్యార్థులలో విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నాను’ అంటుంది చంపా రాస్పెడా.
‘ఈ విజయానికి మూలం ఆమె పడిన కష్టం. అంకితభావం. ఆమె విజయం ఒడిశాలోని యువతకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. వైద్యురాలిగా పేదప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నాను. ఆమె భవిష్యత్‌ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చంపా రాస్పెడా గురించి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి.

ఈ ఇంట్లోనే...
‘రకరకాల మూఢనమ్మకాల వల్ల మా కమ్యూనిటీలో ఆడపిల్లల చదువుకు పెద్దగాప్రాధాన్యత ఇవ్వరు’ అంటున్న చంపా రాస్పెడా తన తల్లిదండ్రులను ఒప్పించి, ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ చదువు దారిలో ముందుకు వెళ్లింది. పెద్దగా సౌకర్యాలు లేని ఇంట్లో పెరిగింది చంప. ఇప్పుడు సాధారణ దృశ్యంగా కనిపిస్తున్న ఆమె ఇంటి చిత్రం భవిష్యత్‌లో స్ఫూర్తిదాయక చిత్రంగా నిలవనుంది. ‘ఈ ఇంట్లోనే చదివి చంప డాక్టర్‌ అయింది’ అనే ఒక్కమాట చాలదా ఎంతోమంది అమ్మాయిలలో ధైర్యం నింపడానికి, ‘మేము కూడా సాధించాలి’ అని వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement