దేశంలో విస్తారంగా అడవులు ఉన్నాయి. వాటిని తిప్పి చూపే స్థానికులూ ఉన్నారు. కాని వారిని ‘గైడ్స్’గా మార్చి, అడవి గురించి వివరించే శిక్షణ ఇవ్వాలి. స్థానికులను ‘గైడ్స్’గా మారిస్తే అడవులను తెలుసుకునేందుకు ప్రజలు వస్తారు. పర్యాటక రంగమూ అభివృద్ధి చెందుతుంది... అంటారు పాయల్ మెహతా(Payal Mehta). దేశంలోనే మొదటి ‘నేచర్ గైడ్స్ అకాడెమీ’ స్థాపించి వివిధ అడవుల్లో క్యాంప్స్ నిర్వహిస్తూ నేచర్ గైడ్‌లను తయారు చేస్తున్న పాయల్ పరిచయం.
‘మన దగ్గర అడవులకు వెళ్లడమంటే అక్కడకు వెళ్లి పిక్నిక్ చేసుకోవడమే. ఫొటోలు తీసుకోవడం,పార్టీ చేసుకోవడం, పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వినడం అంతే. వీరిలో కేవలం ఏ ఒక్క శాతమో ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటారు. ఇక ఎకో టూరిజం పేరుతో అడవుల దాపున ఉన్న రిసార్ట్‌లకు వెళ్లడం ఎలా ప్రకృతిని చూడటమో నాకు అర్థం కాదు. అలాంటి రిసార్టుల్లో లగ్జరీ రూముల్లో ఉండి, స్విమింగ్ పూల్స్‌లో స్నానం చేస్తే ప్రకృతిలో గడిపినట్టా? అడవి నిజమైన సౌందర్యం తెలియాలంటే అడవి గురించి తెలిసిన స్థానికులతో అడవి లోపలికి వెళ్లాలి. అడవితో గడపాలి. అప్పుడు అడవి తెలుస్తుంది. ఆ పని చేయాలంటే ప్రతి అడవికి గైడ్స్ కావాలి. అలాంటి గైడ్స్‌ను మేం తయారు చేస్తున్నాం’ అంటారుపాయల్ మెహతా.
గత సంవత్సరంపాయల్ తన భర్త హర్ష.జెతో కలిసి ‘నేచర్ గైడ్స్ అకాడెమీ’ని స్థాపించారు. కన్హ నేషనల్‌పార్క్ (మధ్యప్రదేశ్‌లో) 18 మందితో కూడిన ఒక బ్యాచ్‌కు శిక్షణ పూర్తి చేశారు కూడా. ‘ఇప్పుడు నేచర్ గైడ్స్‌కి మంచి డిమాండ్ ఉంది. ప్రకృతి అంటే ఆసక్తి ఉన్నవారు దీనిని కెరీర్ ఆప్షన్‌గా స్వీకరించవచ్చు’ అంటారామె.
రెండు ప్రపంచాల మధ్య సాగే ప్రయాణం
‘ప్రస్తుతం నా రోజులు రెండు ప్రపంచాల మధ్య సాగుతున్నాయని చె΄్పాలి. ఒక ప్రపంచం మనుషులది. మరో ప్రపంచం అడవులది. మనుషులను మనం ఇష్టపడక΄ోతే వారితో సంభాషణ జరిపి వారికి ప్రకృతి మీద ప్రేమ కలిగించలేం. అంటే ఒక నేచర్ గైడ్‌కు కావాల్సిన మొదటి లక్షణం మనిషిని ప్రేమించడం. ఒక గైడ్‌గా సూర్యోదయానికి ముందే లేచి, అడవి చూద్దామని వచ్చే ప్రకృతి ప్రేమికులతో కలిసి అడవిలోకి వెళ్తాను. అక్కడ పెద్ద, చిన్న జీవుల కోసం వెతుకుతాం. భోజనం పంచుకుంటాం. కొన్నిసార్లు కథలు చెప్పడానికి మంట చుట్టూ గుమిగూడతాం. ఇక్కడితో నాపాత్ర ముగియదు. ఆ ప్రాంత చరిత్ర, పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అంశాలపై ఫీల్డ్ సెషన్ లు నిర్వహిస్తుంటాను. నా పనిలో కీలకమైన, నాకు నచ్చే సమయం అడవిలో ఉండటం, ప్రతిరోజూ అక్కడ కొత్త విషయం నేర్చుకోవడం’ అంటారామె.
మంచి గైడ్ ప్రకృతి శాస్త్రవేత్త
‘మన దేశంలో టూరిజం పెరిగింది. ఎకో టూరిజం కూడా పెరిగింది. అయితే ఈ టూరిజం ఆపరేటర్లు తమ దారిన, అటవీ శాఖ తమ దారిన, మాలాంటి వాళ్లు ఒకదారిన ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ బర్డ్ వాచర్స్, నేచురలిస్ట్స్, ఫారెస్ట్ హైకర్స్ అడవులకు వచ్చేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. వీరికి అడవిని సరిగ్గా చూపే గైడ్స్‌ల కొరత ఉంది. వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పాలి. అలాగే అడవులకు వారిని బాధ్యులను చేయాలి. అంటే వారు తిరుగుతూ అడవిలో ఏదైనా మార్పు కనిపించినా, జంతువులు అపాయంలో ఉన్నా, కార్చిచ్చులు చూసినా వెంటనే అధికారులకు ఇన్‌ఫార్మ్ చేసేలా శిక్షణ ఇవ్వాలి. ఫుల్‌టైమ్,పార్ట్‌టైమ్‌గా కూడా నేచర్ గైడ్స్‌గా పని చేయవచ్చు. యువత ఈ పనిలోకి వచ్చి పర్యావరణాన్ని కాపాడుకోవాలి’ అంటున్నారుపాయల్ మెహతా.
ప్రకృతి ప్రేమికురాలు
పాయల్ మెహతా ముంబయి అమ్మాయి. ‘నా తల్లిదండ్రులకు ప్రకృతి పట్ల విపరీతమైన ఇష్టం ఉండేది. ఇష్టం అనే కన్నా అదొక అంటువ్యాధి అనొచ్చు. అలా అది నాకు అంటుకుంది. రాత్రిపూట కనిపించే ఆకాశం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి రమణీయ దృశ్యాలు, విరిసే పువ్వులు, మెరిసే మిణుగురులు... చిన్నప్పటి నుంచి నేను ఆసక్తిగా గమనించేదాన్ని. బడిలో నేర్పే ప్రకృతిపాఠాలను సైతం శ్రద్ధగా వినేదాన్ని.
అందుకే యుక్తవయసులోనే పర్వతారోహకురాలిగా శిక్షణ పొందాను. భూగర్భ శాస్త్రంపై విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశాను. గ్రాడ్యుయేషన్ అనంతరం ‘భారతీయ సఫారీ గైడ్’ల కోసం కన్హా నేషనల్‌పార్క్‌లో విదేశీ నిపుణులు ఇచ్చిన శిక్షణను పూర్తి చేశాక ఇక నా జీవితం అడవులకే అంకితం అనుకున్నాను’ అంటారామె. పాయల్ ఇప్పటికే నేపాల్, భూటాన్, భారతదేశం, శ్రీలంక, బోర్నియోలలో ఎక్స్‌పెడిషన్ లీడర్‌గా వ్యవహరించారు. భర్త హర్ష జె.తో కలిసి ఆమె భారతదేశం అంతటా గైడ్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


