ఈ సూర్యుడికి సడన్‌గా ఏమైంది?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి చాలామంది వేస్తున్న ప్రశ్న ఇది. సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడి.. రంగుల కాంతి చుక్కలు, ఇంద్రధనుస్సు వలె మెరుస్తూ కనిపించిన దృశ్యం.. వావ్ అనిపిస్తోంది. అయితే.. అది రెయిన్‌బో ఏమాత్రం కాదు.
ఈ అద్భుత దృశ్యం కనిపించింది స్వీడన్ జామ్‌ట్లాండ్‌లో. శాస్త్రవేత్తలు దీనిని సన్ హాలో అని పిలుస్తారు. సూర్యుడి చుట్టూ 22 డిగ్రీల వ్యాసార్థంతో ఇది ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో.. అందునా శీతాకాలంలో సూర్యుడు ఆకాశంలో తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ హాలో ఏర్పడటానికి కారణం.. ఆకాశంలో 5–10 కి.మీ ఎత్తులో ఏర్పడే సిరస్ మేఘాలు. వీటిలో ఉండే చిన్న హెక్సగాన్ ఆకారపు మంచు స్ఫటికాలు సూర్యకిరణాలు తాకి 22 డిగ్రీల కోణంలో వంగిపోతాయి. అలా.. లక్షలాది కిరణాలు ఒకే విధంగా వంగి కలిసిపోవడం వల్ల సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడుతుంది. అలా ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పర్‌పుల్ రంగులు బయటకు విస్తరిస్తూ ఇంద్రధనుస్సు వలె మెరుస్తాయి. అదే సమయంలో..
[07] A spectacular sun halo in Jämtland, Sweden.pic.twitter.com/YhLl9nF8nV
— 𝘀𝗶𝘆𝗲𝗡𝗴𝗼 (@Mrsiyengo) December 21, 2025
సన్ డాగ్స్/పార్హీలియా అనే ప్రకాశవంతమైన చుక్కలు సూర్యుడి రెండు వైపులా ఏర్పడి ఆకాశాన్ని అందంగా మార్చుతుంది. టాంగెంట్ ఆర్క్స్.. హాలో పైభాగంలో వంగిన కాంతి రేఖలు, సర్కంహొరిజాంటల్ ఆర్క్స్.. ఇంద్రధనుస్సు వలె అడ్డంగా కనిపించే కాంతి రేఖలు కూడా ఉంటాయి. సో.. ఇదేం మాయా జాలం కాదు, పూర్తిగా సైన్స్(ఫిజిక్స్). అయినా కూడా నెటిజన్స్ సూర్యుడికి ప్రకృతి తొడిగిన కిరీటం అని అభివర్ణిస్తున్నారు.
హాలోకి.. ఇంద్రధనుస్సు బోలెడు తేడా ఉంది. ఇంద్రధనుస్సు వర్షపు నీటి బిందువుల వల్ల ఏర్పడుతుంది. కానీ హాలో మంచు స్ఫటికాల వల్ల ఏర్పడుతుంది. హాలోలు అర్కిటిక్ ప్రాంతాలు, స్కాండినేవియా, హిమాలయాలు వంటి చల్లని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో సిరస్ మేఘాలు ఏర్పడడం తక్కువ కాబట్టి చాలా అరుదుగా కనిపించొచ్చు.
కొన్ని దేశాల సంస్కృతుల్లో సన్ హాలోను దైవ సంకేతంగా భావిస్తారు. మరికొన్ని దేశాల్లో శుభసూచకంగా చూస్తారు. చైనాలో మాత్రం వాతావరణ మార్పు సూచనగా చూస్తారు. హాలోలు కనిపించడం అంటే వాతావరణంలో తేమ పెరుగుతోందని.. త్వరలో వర్షం లేదంటే మంచు కురిసే అవకాశం ఉందని సంకేతాం అన్నమాట.
సూర్యుడి విషయంలోనే కాదు.. చంద్రుడి విషయంలోనూ ఇలా జరుగుతుంది. సూర్యుడి స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, అదే విధంగా మంచు స్ఫటికాల వల్ల చంద్రుడి చుట్టూ ఇదే తరహాలో వలయం ఏర్పడుతుంది.


