మన ఫారెస్టుల్లోకి ఫారెన్ ప్రాణులు
అడవులు పిలుస్తున్నాయి, జంతువులు వచ్చేస్తున్నాయి.ఆతిథ్యం మెచ్చి, ట్రిప్ అడ్వైజర్‌లో ఐదు గోర్లు మెరుస్తున్నాయి! సంరక్షణ, సౌకర్యాలు చూసి, ఫారెన్ ప్రాణులన్నీ లవ్ సింబల్ చూపిస్తున్నాయి. అంతేకాదు, ‘అతిథి దేవో భవ!’ అనే సంస్కృతికి జతగా, ‘అడవి స్వర్గ అవార్డ్’తో సత్కరిస్తున్నాయి.
వన్యప్రాణుల గమ్యస్థానంగా భారత్?
‘అతిథి దేవో భవ’ అన్న మాట మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా వర్తిస్తుంది కదా! అందుకే, మన దేశం అందిస్తున్న ఆతిథ్యం, సంరక్షణ చూసి ప్రపంచ దేశాల అడవుల నుంచి వన్యప్రాణులు భారత్ చేరడానికి బ్యాగులు సర్దుకుంటున్నాయి. ఇప్పటికే, ప్రపంచ అడవుల్లో ఉన్న పులులు, సింహాలు, చిరుతలు అన్నీ ‘ఇండియా ట్రిప్ ఎప్పుడు?’ అని ఎదురు చూస్తున్నాయట!
ఇందుకు సాక్ష్యంగా ప్రస్తుతం ప్రపంచ వన్యప్రాణుల ట్రావెల్ గైడ్ తెరిస్తే, ఫస్ట్ ర్యాంక్‌లో మెరిసిపోతున్న దేశం మన దేశమే. గత నాలుగేళ్లలోనే 6,400 జంతువులు భారత్‌కు వచ్చాయి అని తాజాగా సీఐటీఈఎస్ (ప్రమాదం అంచుల్లో ఉన్న జీవజాతుల పరిరక్షణకు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం) గణాంకాలు స్పష్టం చేశాయి. అంటే, 1978 నుంచి ఇప్పటి వరకు భారత జంతుప్రదర్శన శాలల్లోకి వచ్చిన జంతువుల్లో తొంభై శాతం కంటే ఎక్కువ, గత నాలుగేళ్లలోనే రావడం గమనార్హం. వీటితోపాటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతుప్రదర్శన శాలలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల నుంచి పక్షులు, సరీసృపాలు, కోతులు మొదలుకుని పెద్ద పులుల వరకూ వేలాది వన్యప్రాణులు ఒక్కొక్కొటిగా తన ఫేవరెట్ డెస్టినేషన్ గా భారత్‌నే ఎంచుకున్నాయి.
వీటికి పాస్‌పోర్ట్ స్టాంపులు లేవు, ఫ్లైట్ నంబర్లు గుర్తుండవు. కాని, వాటన్నింటికీ కావాల్సింది మాత్రం ఒక్కటే– విశాలమైన నివాస స్థలం, సహజ వాతావరణం, భద్రత, సంరక్షణ. అవి మన దేశంలో విస్తృతంగా ఉన్నాయి.
అయితే, ఈ గణాంకాల్లో 2023 సంవత్సరం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒక్క ఏడాదిలోనే 4,051 వన్యప్రాణులు భారత్‌కు దిగుమతి కావడం రికార్డు స్థాయిగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయిలో జంతుప్రదర్శన శాలలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల విశ్వాసాన్ని భారత్ ఎంతగా సంపాదించిందో ఈ సంఖ్యలే స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా, 2022లో ప్రపంచవ్యాప్తంగా 5,496 జంతువులు వివిధ జంతుప్రదర్శన శాలలకు దిగుమతి అయ్యాయి. వాటిలో, 486 జంతువులు మన దేశంలోని జంతుప్రదర్శన శాలలకు చేరడంతో, వన్యప్రాణుల దిగుమతిలో రెండో స్థానంలో నిలిచింది. ఇక 2023లో మాత్రం 4,051 జంతువులను దిగుమతి చేసుకొని, భారత్ అగ్రస్థానానికి చేరింది. 2024లో కూడా భారత్ నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించింది. ఇలా ఈ గణాంకాలు భారత్ ఇప్పుడు కేవలం వన్యప్రాణుల నిలయమే కాకుండా, ప్రపంచ జూలు, సంరక్షణ కేంద్రాలకు విశ్వసనీయమైన భాగస్వామిగా మారిందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
మీరొస్తామంటే.. మేమొద్దంటామా?
భారతదేశం అంటే భాషల సంగమం, సంస్కృతుల సమ్మేళనం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రపంచ వన్యప్రాణుల కూడలి కూడా! దేశం మారితే జీవితం మారుతుందనుకునే వన్యప్రాణులన్నింటికీ భారత్ ఒక ఓపెన్ డోర్‌లా మారింది. ఇక్కడికి వచ్చినవారు బతకగలరు, నిలబడగలరు, కొత్త జీవితం మొదలుపెట్టగలరు. అందుకే 1978 నుంచి ఇప్పటివరకు భారత్‌కు అత్యధికంగా వన్యప్రాణులను పంపిన దేశాల్లో దక్షిణాఫ్రికా (2,072) అగ్రస్థానంలో నిలిచింది. అంటే భారత్‌లోకి అడుగుపెట్టిన ప్రతి మూడు జంతువుల్లో ఒకటి దాదాపుగా దక్షిణాఫ్రికా అడవుల నుంచే వచ్చినదన్న మాట! ఆ తర్వాత యూఏఈ (995), చెక్ రిపబ్లిక్ (854), మెక్సికో (816), ఆస్ట్రియా (687) వంటి దేశాలు వరుసలో కనిపిస్తున్నాయి.
నిజానికి దక్షిణాఫ్రికా వంటి దేశాలు జంతువులను భారత్‌కు పంపడం వెనుక భావోద్వేగాలకన్నా గట్టి వాస్తవాలే ఉన్నాయి. ఒకప్పుడు అంతులేని అడవులతో ప్రపంచానికి ఊపిరి పోసిన ఆఫ్రికా ఖండం, ఇప్పుడు వేటగాళ్ల దాడులు, అక్రమ వన్యప్రాణుల వ్యాపారం, రాజకీయ అస్థిరత, మానవ–వన్యప్రాణి ఘర్షణలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జంతువులను కాపాడుకోవాలంటే వాటిని అడవుల్లోనే ఉంచడంతోనే సరిపోవడం లేదు, భద్రత ఉన్న మరో ఆవాసం అవసరం అవుతోంది. ఆ భద్రతను అందించగలిగిన దేశంగా భారత్ నిలిచింది.
భారత్ ఎందుకు ముందుంది?
మంచుతో కప్పబడే స్విట్జర్లాండ్, ఆకాశాన్ని తాకే భవనాలతో నిండిన సింగపూర్, చల్లని వాతావరణం కలిగిన యునైటెడ్ కింగ్‌డమ్, ఎడారి వేడితో మండిపోయే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా ఈ దేశాలన్నింటికీ ఒకే సమస్య. జంతువులకు సరిపడే సహజ జీవ వాతావరణం కొరత. అక్కడ స్థలం తగ్గిపోయింది, అడవులు కనుమరుగయ్యాయి, వాతావరణం జంతువుల సహజ జీవితానికి అనుకూలంగా లేకుండా మారింది. అప్పుడు ప్రపంచం చూపు భారత్‌పై పడింది. విస్తారమైన అడవులు, పచ్చని లోయలు, ఉష్ణమండల వాతావరణం, పెరుగుతున్న సంరక్షణ కేంద్రాలు భారత్‌ను జంతువులకు ఒక సేఫ్ హోమ్‌గా మార్చాయి.
ఇక్కడ జంతువులు బతకడమే కాదు, పెరుగుతాయి, పిల్లల్ని పెంచుతాయి, మళ్లీ జీవ వైవిధ్యానికి ఊపిరి పోస్తాయి. ఇతర దేశాలు తమ పరిమితుల కారణంగా జంతువులను పంపుతున్నప్పుడు, భారత్ వాటిని బాధ్యతగా స్వీకరించి, జంతువుల మానసిక ఆరోగ్యం, ఆహారం, సహజ వాతావరణం అన్నీ అందేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అప్పుడు, ప్రపంచం చూపు భారత్‌పై పడింది. అందుకే సముద్రాలు దాటినా, ఖండాలు మారినా, చివరకు వన్యప్రాణులు తమ చిరునామాగా భారత్‌నే ఎంచుకుంటున్నాయి.
చిన్నవాళ్లే పెద్ద ఆకర్షణ!
జూకి వెళ్లగానే పిల్లల కళ్లలో ముందుగా మెరిసేవి ఏవో తెలుసా? సింహాలు కాదు, పులులు కాదు! మొదటగా మెరిసేవి మొసళ్లు, తాబేళ్లు, పాములు, రంగురంగుల పక్షులు, చిలిపి కోతులు! నిజానికి ఇవే పిల్లల ఫేవరెట్ స్టార్‌క్యాస్ట్. పెద్ద పులిని చూడాలని, ఫొటోలు దిగాలని అనుకుంటాం కాని, జూ మొత్తం మజాని ఇచ్చేది ఈ చిన్న చిన్న క్యారెక్టర్లే! నిజానికి, ఇవే జూను ‘ఇంకా చూద్దాం.. ఇంకా చూద్దాం’ అని పిల్లలను ఒకచోట నిలబెట్టనివ్వకుండా జూ మొత్తం తిప్పేలా చేస్తాయి. ఎందుకంటే, నెమ్మదిగా నడిచే తాబేలు మన టైమ్‌ను ఆగిపోయేలా చేస్తే, కోతులు గంతులు వేస్తూ లైవ్ కామెడీ షోను చూపిస్తాయి. ఇక పక్షులు రెక్కలు విప్పితే రంగుల పండుగ మొదలైనట్టే! ఇలా ఇవన్నీ అరవవు, హడావుడి చేయవు, సైలెంట్‌గా ప్రకృతి పాఠాలను పిల్లల మెదడులోకి లైవ్ టీచింగ్ చేస్తాయి. ఇలా ఒక హిట్ సినిమా హీరోలా సింహాలు, పులులు ఫ్రేమ్ తీసుకుంటాయి కాని, జూకి ప్రాణం పోసేది, నడిపించేది మాత్రం ఈ చిన్న సైలెంట్ హీరోలే!
ఎగుమతుల్లో వెనకుంది!
జంతువుల అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా సవాలుగా ఉన్నప్పటికీ, భారత్ మాత్రం చట్టబద్ధంగా చాలా పరిమిత సంఖ్యలోనే వన్యప్రాణులను ఎగుమతి చేసింది. 1976 నుంచి 2024 వరకు దాదాపు ఐదు దశాబ్దాల కాలంలో భారత్ నుంచి ఎగుమతి అయిన జంతువుల సంఖ్య కేవలం 483 మాత్రమే. ఈ జాబితాలో ‘ఘరియల్ మొసళ్లు’ (102) అగ్రస్థానంలో నిలిచాయి. ఇక ఒక్క ఏడాదిలో అత్యధికంగా జంతువులు ఎగుమతి అయిన సంవత్సరం 2005, ఆ ఏడాది మొత్తం 47 జంతువులు విదేశాలకు వెళ్లాయి. దిగుమతుల్లో ప్రపంచానికి కేంద్రంగా మారిన భారత్, ఎగుమతుల్లో మాత్రం నియంత్రణతో కూడిన విధానాన్నే అనుసరిస్తున్నదని ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.
జూ వెనుక జీవితం!
ఒకప్పుడు వన్యప్రాణుల అక్రమ వ్యాపారం అంటే అడవుల్లో తుపాకులతో వేటగాళ్లు చేసే నేరమే అనుకుంటాం కాని, ఇప్పుడు ఆ నేరం రూపం మార్చుకుంది. పేపర్లు, అనుమతులు, ప్రొఫెషనల్ పదజాలంతో జరిగే ‘వైట్ క్రైమ్’గా మారింది. బయటకు చూస్తే ‘సంరక్షణ’, లోపల మాత్రం విలువైన అవయవాల లెక్క. ఒక జంతువు జూలోకి చేరేలోపు ఎన్ని సంతకాలు, ఎన్ని అనుమతులు, ఎన్ని ‘ఎక్స్‌పర్ట్ ఓకేలు’ దాటిందో మనకు కనిపించదు. మనం చూసేదే, కేవలం బోనులో నడిచే జంతువునే. కాని, ఆ ప్రయాణం ఎక్కడ మొదలైందో, మధ్యలో ఏం జరిగిందో మాత్రం కనిపించదు. చాలామందికి తెలియదు, మరికొంతమందికి అనవసరం కూడా! అయితే ఈ అనుమానాలకు, గత సంఘటనలే సాక్ష్యం.
2020లో కేరళలో పేలుడు ఆహారంతో గర్భిణి ఏనుగును చంపిన సంఘటన, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో బయటపడ్డ పులి చర్మం, దంతాలు, గోర్లు అక్రమ రవాణా కేసులు ఎన్నో నిజాన్ని చూపించాయి. ఇక మానవ రక్షణ పేరుతో మూగజీవులపై జరిగే బహిరంగ హింసలు కూడా మన దేశంలో తక్కువేమీ కాదు. ఇక సరీసృపాల అక్రమ వ్యాపారం మరింత సైలెంట్‌గా జరుగుతోంది. వీటితోపాటు మొసలి పిల్లలు, అరుదైన పాములు వార్తలకెక్కకుండానే అమ్ముడుపోతున్న సంఘటనలు అడపా దడపా బయటపడుతున్నాయి. డిమాండ్ ఉన్నంతవరకూ నేరం దారులు వెతుక్కుంటుంది.
అందుకే అసలు ప్రశ్న! భారీగా వస్తున్న ఈ వన్యప్రాణులు నిజంగానే సేఫ్ హ్యాండ్స్‌లోకే వెళ్తున్నాయా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానాలు లేకపోతే, మంచి ఉద్దేశంతో మొదలైన వ్యవస్థ నేరగాళ్ల చేతుల్లోకి జారిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. భారత్ వన్యప్రాణులకు డెస్టినేషన్ గా మారిందంటే కారణం ఒక్కటే! ఇక్కడికి అడుగుపెట్టే ప్రతి జంతువును కూడా అతిథితో సమానంగా చూసుకునే మన సంస్కృతి. కాని, ఆ జీవులపై పడే ప్రతి గాయం, ‘అతిథి దేవోభవ’ అనే మాటకు అర్థాన్ని చెరిపేస్తుంది.
పెద్ద పిల్లుల రాజ్యం!
అడవుల్లో పులుల సంఖ్యలో భారత్ టాప్‌లో ఉంటే, మన దేశంలోని జంతుప్రదర్శన శాలల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ప్రస్తుతం మన దేశ జంతుప్రదర్శన శాలల్లో పులి, సింహం, చిరుత– ఇవే అసలైన స్టార్స్. వాటి వెంట జాగ్వార్, లీపర్డ్, స్నో లీపర్డ్‌లు సపోర్టింగ్ రోల్స్‌లో మెరిసిపోతున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం జంతుప్రదర్శన శాలల్లో పెద్ద పిల్లుల రాజ్యమే కొనసాగుతోంది. భారత దేశపు అడవి వాతావరణం, విశాలమైన నివాస స్థలాలు, సహజ ఆహారం, వెటర్నరీ కేర్, ప్రత్యేకంగా రూపొందించిన డైట్ ప్లాన్లు ఇవన్నీ కలిపి ఈ పెద్ద పిల్లులకు ఎక్కడా లేనంతటి సౌకర్యాన్ని ఫుల్ కంఫర్ట్ అందిస్తున్నాయి. అదే సమయంలో పక్షులు, సరీసృపాలు, కోతులు, తాబేళ్లు, మొసళ్లు సైలెంట్ చెక్–ఇన్ స్టయిల్‌లో మన జంతుప్రదర్శన శాలల్లోకి అడుగు పెడుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా ఆఫ్రికా అడవుల నుంచి యూరప్ నగరాల జూల నుంచి, అమెరికెన్ నగరాల్లోని వన్యప్రాణులు ఉంటున్నాయి.
మనిషి మక్కువే మార్గంగా!
వన్యప్రాణుల గమనాన్ని నిర్ణయించేది ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఒప్పందాలే కాదు, వ్యక్తిగత అభిరుచులు కూడా ఇప్పుడు ఆ దిశను మలుపు తిప్పుతున్నాయి. ఒక అరుదైన జంతువుపై ఒక వ్యక్తికి ఏర్పడిన మక్కువ కూడా భారత్‌ను ప్రపంచ వన్యప్రాణుల గమ్యంగా మారుస్తోంది. ఇందుకు, కడాబాంబ్ ఒకామి కథ ఒక సజీవ ఉదాహరణ. కర్ణాటకకు చెందిన ఎస్. సతీష్‌కు అమెరికాలో జన్మించిన ఒక కుక్కపిల్లను చూసిన క్షణమే అది పెంపుడు జంతువులా కాకుండా, ఒక అద్భుతంలా అనిపించింది. తోడేలి ఉనికి, కాక్‌షియన్ షెపర్డ్ బలం కలిసిన ఒకామిని అన్ని అనుమతులతో విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చి చరిత్ర సృష్టించాడు.
ఇందుకోసం దాదాపు రూ.47 కోట్లు ఖర్చు చేశాడు. ఇదే బాటలో దేశంలోని చాలామంది సంపన్నులు విదేశాల నుంచి తెచ్చిన హస్కీలు, అలాస్కన్ మలామ్యూట్లు, టిబెటన్ మాస్టిఫ్‌లను తమ స్టేటస్ సింబల్స్‌గా ఫీల్ అవుతున్నారు. ఇలా మరెన్నో యూరప్ నుంచి వచ్చిన అరుదైన గుర్రాలు, దక్షిణ అమెరికా నుంచి తెప్పించిన విదేశీ పక్షులు వ్యక్తిగత సంరక్షణ కేంద్రాల్లో చోటు సంపాదించుకున్నాయి. ఇలా అడవులకే పరిమితమవ్వాల్సిన జీవులు ఇప్పుడు వ్యక్తిగత కలలు, భారీ ఖర్చులు, భిన్నమైన ఆసక్తులతో కొత్త భూభాగాల్లోకి అడుగుపెడుతున్నాయి.


