భారతదేశ విమానయాన రంగంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన ‘టెర్మినల్ 2’ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(శనివారం) ప్రారంభించనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా ప్రకృతి నేపథ్యంతో (Nature-themed) నిర్మించిన ఈ టెర్మినల్, విమాన ప్రయాణీకులకు సరికొత్త అనుభూతిని అందించబోతోంది. సాధారణంగా విమానాశ్రయాలు అంటే సిమెంట్ కట్టడాలు గుర్తొస్తాయి.. కానీ ఇక్కడ అడుగుపెడితే అస్సాంలోని దట్టమైన అడవుల్లోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది.
ఈ కొత్త టెర్మినల్ ప్రధాన ఆకర్షణ ‘స్కై ఫారెస్ట్’. భవనం లోపలే ఏర్పాటు చేసిన ఈ పచ్చని అడవి ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈశాన్య భారత సంస్కృతికి ప్రతీకలైన వెదురు, పూలు, సాంప్రదాయ 'జాపి' నమూనాలను ఇక్కడ అద్భుతంగా ఉపయోగించారు. అస్సాం రాష్ట్ర పుష్పం 'కోపౌ' ఆకారంలో ఉండే స్తంభాలు ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తాయి. దీని అద్భుతమైన డిజైన్‌కు ఇప్పటికే ‘అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డు 2025’ లభించడం విశేషం.
సుమారు 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ ఏటా 1.3 కోట్ల మంది ప్రయాణికుల సామర్ధ్యం కలిగివుంది. అందంలోనే కాదు, సాంకేతికతలోనూ ఇది మేటిగా నిలుస్తోంది. రద్దీ సమయాల్లో సుమారు 4,500 మంది ప్రయాణికులను త్వరగా తనిఖీ చేయడానికి ఫుల్ బాడీ స్కానర్లు, ఆటోమేటెడ్ బ్యాగేజీ యంత్రాలు, అత్యాధునిక ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఇక్కడ ఉన్నాయి. ఇది రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా ఆదా చేస్తుంది.
పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి నిర్మించిన ఈ భవనం పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. సహజ సిద్ధమైన వెలుతురు వచ్చేలా చేసిన డిజైన్, నీటి పునరుద్ధరణ వ్యవస్థలు దీనిని ‘గ్రీన్ ఎయిర్‌పోర్ట్’గా నిలబెట్టాయి. కాజిరంగా ఖడ్గమృగాల నమూనాలు, స్థానిక కళాఖండాలతో నిండిన ఈ టెర్మినల్ అస్సాం పర్యాటకానికి,వాణిజ్యానికి ఒక భారీ గేట్‌వేగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
‘గ్రీన్ ఎయిర్‌పోర్ట్’ ప్రత్యేకతలివే..
ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రకృతి ఆధారిత (Nature-themed) విమానాశ్రయం.
టెర్మినల్ లోపలే పచ్చని చెట్లతో కూడిన 'స్కై ఫారెస్ట్'ను ఏర్పాటు చేశారు.
దీని అద్భుతమైన డిజైన్‌కు 'అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డు 2025' లభించింది.
ఈశాన్య భారత వారసత్వాన్ని చాటేలా భవనమంతా వెదురును వినియోగించారు.
అస్సాం ప్రత్యేకత అయిన 'కోపౌ' ఆర్కిడ్ పూల ఆకృతిలో స్తంభాలను నిర్మించారు.
ఏటా 1.3 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించగల భారీ సామర్థ్యం దీని సొంతం.
ప్రయాణికుల కోసం అత్యాధునిక ‘ఫుల్ బాడీ స్కానర్లు’ అందుబాటులో ఉన్నాయి.
బ్యాగేజీ నిర్వహణ కోసం పూర్తి ఆటోమేటెడ్ యంత్రాలను ఏర్పాటు చేశారు.
ఈ విమానాశ్రయం పూర్తిగా పర్యావరణ హితమైన సౌరశక్తితో నడుస్తుంది.
కాజిరంగా ఖడ్గమృగాలు, అస్సామీ 'జాపి' నమూనాలతో అలంకరించారు.
పీక్ సమయంలో 4,500 మంది ప్రయాణికులను సులువుగా నిర్వహించగలదు.
పగటిపూట సహజ సిద్ధమైన వెలుతురు వచ్చేలా ‘గ్రీన్ ఎయిర్‌పోర్ట్’ను తీర్చిదిద్దారు.


