సాక్షి,ముంబై: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవిలోంచి బైటికి వచ్చిన ఒక పులి రోడ్డుమీది తిష్ట వేసుకుని కూర్చుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు బెంబేలెత్తిపోయారు. చంద్రపూర్-మొహర్లి రోడ్డులోని తడోబా సమీపంలో కనిపించిన ఈ దృశ్యం పలువురిన్ని ఆశ్చర్యపర్చింది. సఫారీలలో కూడా కనిపించని ఈ దృశ్యాన్ని చూసి ఆహా ఏమి అదృష్టం అనుకుంటూ పులిని చూసి మురిసిపోయారు. ఈ సంఘటన తడోబా టైగర్ రిజర్వ్‌లోని బఫర్ జోన్‌లో జరిగిందీ సంఘటన.
ఆకాష్ ఆలం అనే స్థానిక యువకుడు ఈ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వైరల్ వీడియో ప్రకారం తడోబా టైగర్ రిజర్వ్ పార్క్ నుండి రోడ్డుమీదకు వచ్చింది. ఒక పులి రోడ్డు మధ్యలో కూర్చుని ఉండటం వల్ల రెండు వైపులా చాలా గంటలు ట్రాఫిక్ జామ్ అయింది. అయినా తమ కళ్ల ముందు పులి రోడ్డుపై చాలా సేపు ఉన్న దృశ్యాన్ని చూసి బాటసారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
నడి రోడ్డుపై దర్జాగా కూర్చున్న పులి వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులు కూడా స్పందించారు. చంద్రపూర్ నుండి మొహర్లికి వెళ్లే మార్గం ఈ అడవి గుండా వెళుతుంది. రోడ్డుకు ఇరువైపులా దట్టమైన అడవులు ఉండటం మూలంగా తరచుగా జంతువుల కదలికలు మామూలు అంటున్నారు గ్రామస్తులు. ఉదయం, సాయంత్రం వేళల్లో జంతువులు రోడ్డు దగ్గర తరచుగా కనిపిస్తాయని చెప్పారు. రోడ్డుపై అకస్మాత్తుగా అడవి జంతువులు కనపడటం, మానుషులకు, వాటికి మధ్యఘర్షణలు జరుగుతాయట. దీంతోఅటవీ శాఖ ఆ అడవి గుండా వెళ్లేవారికి మార్గదర్శకాలను జారీ చేసింది. ఉదయం, రాత్రివేళల్లో ఈ దారి వాడకాన్ని పరిమితం చేయాలని, అలాగే వేగాన్ని నియంత్రించాలని కోరింది. ముఖ్యంగా జంతువులు ప్రయాణిస్తున్నప్పుడు హారన్ మోగించ వద్దని లేదా వారి వాహనాల నుండి దిగవద్దని కోరింది.


