ఒడిశా అసెంబ్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం
క్రమశిక్షణతో నడుచుకోవాలని ఎమ్మెల్యేలకు సూచన
పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని పిలుపు
భువనేశ్వర్: ఒడిశా శాసనసభలో అడుగుపెడితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి పునాది ఇక్కడే పడిందని అన్నారు. ఆమె గురువారం ఒడిశా అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించారు. పవిత్రమైన శాసనసభలో సభ్యులంతా క్రమశిక్షణతో నడుచుకోవాలని, ప్రజలకు ఆదర్శవంతంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఒడిశా ఎమ్మెల్యేగా పనిచేసిన రోజులను ముర్ము గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఆనాటి జ్ఞాపకాలు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మదిలోకి వస్తున్నాయని చెప్పారు. సొంతింటికి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఒడిశా అసెంబ్లీ తనకు ఎన్నో గొప్ప పాఠాలు నేరి్పంచిందని వెల్లడించారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణంగా ఈ సభ, ఒడిశా ప్రజలు, పూరీ జగన్నాథుడి ఆశీస్సులేనని ఉద్ఘాటించారు.
దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం
‘‘ఎమ్మెల్యేగా ఈ సభలో మంత్రులను ప్రశ్నలు అడిగాను. అలాగే మంత్రిగా ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానాలిచ్చాను. రాష్ట్రపతి హోదాలో దేశ విదేశాల్లో ఎన్నో చట్టసభల్లో ప్రసంగించాను. కానీ, ఒడిశా అసెంబ్లీలో మాట్లాడడం నాకు మరింత ప్రత్యేకం. ఒక మారుమూల గ్రామంలో జన్మించిన నేను ఈ సభలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టాను.
ఎలా మాట్లాడాలో, వేర్వేరు సందర్భాల్లో ప్రజలతో ఎలా వ్యవహరించాలో ఈ సభే నేరి్పంది. తొలిసారిగా 2000 సంవత్సరంలో ఎమ్మెల్యేగా విజయం సాధించాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ కూడా నాతోపాటే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజా ప్రతినిధులుగా మనకు దేశమే ప్రాముఖ్యం కావాలి. దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచినవారు మాటలకు, చేతలకు మధ్య సమతూకం పాటించడం నేర్చుకోవాలి.
ఈ టెక్నాలజీ యుగంలో ప్రజా ప్రతినిధులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అందుకే సభ లోపల, బయట క్రమశిక్షణతో నడుచుకోవాలి. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. సమాజంలోని ఆఖరి వ్యక్తికి మనం సేవలందించాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేయాలి’అని రాష్ట్రపతి ముర్ము విజ్ఞప్తిచేశారు. అలాగే ఒడిశా అసెంబ్లీలోని గది నెంబర్ 11ను ఆమె సందర్శించారు. ముర్ము 2000 నుంచి 2004 వరకు ఒడిశా మంత్రిగా పని చేసిన సమయంలో ఈ గదిని ఉపయోగించుకున్నారు.


